టీటీడీ ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవం

భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చిన భ‌క్త బాంధ‌వులు

తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలోని స్థానిక ఆలయాల్లో కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయాలన్నీ దీప కాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, దీపారాధనలు నిర్వహించి భక్తులకు దైవదర్శన భాగ్యం కల్పించారు.తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కార్తీక దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు.తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సాయంత్రం 6.30 గంటలకు శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుంచి కార్తీక దీపం, నూతన వస్త్రాలను ఆలయ మర్యాదలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారికి ఆస్థానం నిర్వహించారు.

అదేవిధంగా శ్రీ కోదండ రామాలయంలో రాత్రి 8 గంటలకు శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుంచి ఆలయ మర్యాదలతో పడి, కార్తీక దీపం, నూతన వస్త్రాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం స్వామి వారికి కార్తీక దీపోత్సవ ఆస్థానం నిర్వహించారు.కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు. నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.

నారాయణ వనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన తెప్పోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజు రాత్రి 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ ధర్మయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ వెంకట శివప్రసాద్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!