వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : సీఎం
క్యూర్, ప్యూర్ ప్రాంతాల్లో పనులపై రేవంత్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్ : క్యూర్, ప్యూర్ ప్రాంతాల్లో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయా పనుల పురోగతిని తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆయా ప్రాజెక్టులపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు.ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధిపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించారు .మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్ల పురోగతిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. మూసీ రివర్ ప్రంట్ ప్రాజెక్టు ఫేజ్-1లో భాగంగా హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కి.మీ. ప్రాంతాన్ని జోన్-1 ఏ గా, ఉస్మాన్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కి.మీ ప్రాంతాన్ని జోన్-1 బీ గా విభజించి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
జనవరి 2027 లో ఫేజ్-1 పనులు మొదలు పెట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే ఫేజ్-1 టెండర్ల ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. మీర్ ఆలం ట్యాంక్ అభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. జనవరి 2028 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్టు తెలిపారు. మిరాలం చెరువు అభివృద్ధితో పాటు చెరువులో ఎంతో కాలంగా పేరుకు పోయిన పూడికను తొలగించాలని ఆదేశించారు సీఎం . రేడియల్ రోడ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని అన్నారు. ఈ రోడ్ల కోసం భూసేకరణ ప్రక్రియ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గండిపేట వద్ద నిర్మాణంలో ఉన్న ఆధునిక గోశాల పనులు మార్చి 2027 నాటికి పూర్తి చేసేలా వేగం పెంచాలని ఆదేశించారు. ఫేజ్-1 కు సంబంధించి టెక్నో-ఎకానమీ ఫీజిబిలిటీని, కూకట్పల్లి నుంచి రాయదుర్గ్ మీదుగా బయోడైవర్సిటీ వరకు అలైన్మెంట్ సాధ్యాసాధ్యాలను అధికారులు వివరించారు.
బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి సెక్రటేరియట్, బషీర్‌బాగ్ మీదుగా రాణీగంజ్ వరకు అలైన్మెంట్ ప్రతిపాదనల గురించి అధికారులు వివరించారు. దీంతో పాటు నెక్లెస్‌రోడ్, రాయదుర్గ్, పీపుల్స్ ప్లాజా పరిసరాల్లో PRTS డిపోలను నిర్మించేందుకు అనువైన స్థలాలను గుర్తించి, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. డిపో పరిసరాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ ఉండేందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. రూట్స్, డిపోల నిర్మాణం, ఇతర అంశాలపై పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తర్వాత ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో IIIT జంక్షన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జికి సంబంధించి పలు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఫుట్‌బ్రిడ్జి సమీపంలో ప్రధానంగా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
కోహెడలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. మార్కెట్ అభివృద్ధి పనులతో మెరుగైన రవాణా సౌకర్యం కోసం సమాంతరంగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు . క్యూర్ పరిధిలో చెరువుల పునరుద్ధరణలో భాగంగా అవసరమైన చోట ఎస్టీపీల ఏర్పాటు ప్రతిపాదనలను హైడ్రా కమిషనర్ వివరించారు. నగరంలో మెట్ల బావుల పునరుద్ధరణ విషయంలోనూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
