విశాఖపట్నం : ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన విశాఖలో పర్యటించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని నగరంలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని మంత్రి పరామర్శించారు. అనంతరం వాసం శెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు. ప్రమాదంలో గాయపడిన ముగ్గురు ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించడం జరిగిందన్నారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందుతోందని అన్నారు వాసం శెట్టి సుభాష్. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాం అని తెలిపారు. గాయపడిన వారికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా అందజేస్తాం అని వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో అవసరమైన సంఖ్యలోనే కార్మికులు విధుల్లో ఉన్నారని చెప్పారు. ప్లాంట్లో భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాం అని అన్నారు. ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. అయితే కార్మిక సంఘాల నేతల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇదిలా ఉండగా కార్మిక శాఖ మంత్రితో పాటు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, కేంద్ర మంత్రులు హెచ్ డి కుమార స్వామి, వర్మ, ఎంపీలు ఉన్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
