అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. గుంటూరు సర్వజన ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్న ప్రయోగశాలను స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ సంస్థ సాంకేతిక సహకారంతో అభివృద్ధి చేయనుంది. రెండేళ్లలో సుమారు 2 వేల నమూనాలను పరీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్ట్రాజెనెకా సంస్థ 1,000 మంది రొమ్ము క్యాన్సర్, 1,000 మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు నిర్వహించే జన్యు పరీక్షల ఖర్చును భరిస్తుంది. రొమ్ము క్యాన్సర్ లో బీఆర్‌సీఏ1, బీఆర్‌సీఏ2, ఇతర, ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో ఈజీఎఫ్‌ఆర్, కేఆర్‌ఏఎస్, ఎన్‌ఆర్‌ఏఎస్, బీఆర్‌ఏఎఫ్, ఇతర మార్పులను పరిశీలిస్తారు. జన్యు పరీక్షల్లో బయటపడిన మార్పులను బట్టి ప్రత్యేక మందులను సిద్ధం చేస్తారు. గుంటూరులోని ప్రయోగాత్మక ప్రయోగశాల తర్వాత అమరావతి క్వాంటం వ్యాలీలో పూర్తి స్థాయి జన్యు పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించేలా దీనిని రాష్ట్రస్థాయి కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్ర జన్యు సమాచార వ్యవస్థతోనూ అనుసంధానిస్తారు.
జన్యు సమాచారం, కృత్రిమ మేధస్సు, ఆధునిక వైద్య పరిశోధనలను అనుసంధానించడం దీర్ఘకాలిక లక్ష్యం అని స్పష్టం చేసింది ఏపీ సర్కార్. సేకరించే సమాచారాన్ని భవిష్యత్తులో వ్యక్తికి అనుగుణమైన చికిత్సలు, వైద్య పరిశోధనలు, ఆధునిక ఔషధ పరిశోధనలకు ఉపయోగించనున్నారు.భవిష్యత్తులో రక్తంలో కనిపించే కొన్ని మార్పులను గుర్తించడం ద్వారా 14 రకాల క్యాన్సర్లను ముందుగానే గుర్తించే పరీక్షను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. దీనిని పెద్ద సంఖ్యలో ప్రజలకు పరీక్షలు నిర్వహించే స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయిలో జన్యు సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదన కూడా ఉంది. ఆరోగ్యవంతుల జన్యు సమాచారంతో పాటు అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారి సమాచారాన్ని సేకరించి భద్రపరుస్తారు. భవిష్యత్తులో వ్యాధులపై పరిశోధనలు, కొత్త పరీక్షలు, మెరుగైన చికిత్స విధానాల రూపకల్పనకు దీనిని ఉపయోగిస్తారు.
క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించే విధానాన్ని ప్రాజెక్టులో భాగంగా బలోపేతం చేయనున్నారు. రొమ్ము క్యాన్సర్‌కు రొమ్ము పరీక్షా పరికరాలను, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ఛాతీ ఎక్స్‌రేలను ఉపయోగిస్తారు. ఊపిరితిత్తుల చిత్రాల్లో అనుమానిత మార్పులను కృత్రిమ మేధస్సుతో గుర్తిస్తారు. రెండేళ్లలో 60 వేల వరకు ఛాతీ ఎక్స్‌రేలను ఈ విధానంలో పరిశీలించేలా ప్రణాళిక ఉంది.