తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు గజ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. వాహనం ముందు గజ రాజులు గంభీరంగా నడుస్తుండగా.. మంగళ వాయిద్యాల నడుమ, భక్తజనుల గోవింద నామ స్మరణతో తిరుమాడ వీధులు భక్తిపారవశ్యంతో మార్మోగాయి. భక్త బృందాలు భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తూ ఆధ్యాత్మిక సందడి నెలకొల్పాయి. జీయ్యంగార్ల ప్రబంధ పారాయణంతో వాహన సేవ మరింత వైభవంగా సాగింది.
విశేష సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ శ్రీ మలయప్ప స్వామివారిని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగి పోయారు. పూర్వ కాలంలో రాజులను పట్టాభిషేకం వంటి విశేష సందర్భాల్లో గజాలపై ఊరేగించే వారు. విశిష్ట వ్యక్తులను ఘనంగా సత్కరించే సందర్భాల్లో గజారోహణం చేసే సంప్రదాయం కూడా ఉంది. పురాణాల ప్రకారం శ్రీ మలయప్ప స్వామివారి గజ వాహన సేవను దర్శించడం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు. అందుకే గజ వాహన సేవకు భక్తులలో విశేష ప్రాధాన్యత ఉంది.
శ్రీ మలయప్ప స్వామి వారు గజ వాహనాన్ని అధిరోహించిన రోజునే కాకుండా బ్రహ్మోత్సవాల ఇతర వాహన సేవల సమయంలోనూ టీటీడీ గజరాజులు ప్రత్యేకంగా పాల్గొని ఉత్సవ వైభవాన్ని ఇనుమడింప జేస్తాయి. ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
