క‌రవు నివార‌ణ చ‌ర్య‌ల‌పై యాక్ష‌న్ ప్లాన్ త‌యారు చేయాలి

ఆదేశించిన రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలో చోటు చేసుకున్న ఎల్ నినో ప్ర‌భావంపై సీరియ‌స్ గా స్పందించారు. తక్ష‌ణ‌మే న‌ష్ట నివార‌ణ‌కు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని ఆదేశించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు, ఆర్ఎస్కే సిబ్బందితో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఎల్ నినో సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం దిశా నిర్దేశం చేశారు. ఎల్ నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం అత్యంత ముఖ్య‌మ‌ని పేర్కొన్నారు. ధరలు తగ్గింపే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలను అదుపులో పెట్టాలని ఆదేశించారు. హైరిస్క్ ఆర్ఎస్కే పరిధిలోని హార్టికల్చర్ పంటలను ఆదుకునేందుకు ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాల‌న్నారు. ప్ర‌ధానంగా డిమాండ్ ఆధారిత పంటల సాగుపై ఫోకస్ పెట్టాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

ఎల్ నినో ప్రభావాన్ని తట్టుకునేలా తాత్కాలిక, మధ్యంతర ప్రణాళికలతో వెళ్లాలని పేర్కొన్నారు. ఎల్ నినో పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకున్నామ‌ని, సిద్దం చేసుకున్న యాక్షన్ ప్లాన్ ప్రకారం ప్రతి ఒక్కరూ పని చేయాలని అన్నారు. ఎల్ నినో ప్రభావం కేవలం రైతుల మీదే కాదు..అన్ని వ్యవస్థలపై పడుతుందన్నారు. .ఎల్ నినో బారి నుంచి రైతులను కాపాడే ప్రయత్నం చేస్తూనే… ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిమాండ్ కు అనుగుణంగా వివిధ పంటలు సాగు చేయాలన్నారు.
పంటల బీమా చేయించాం… పంట నష్టం సంభవిస్తే.. బీమా మొత్తం రైతులకు దక్కేలా చేయాలని పేర్కొన్నారు. గోడౌన్లలో బియ్యం నిల్వలు ఎంత మేరకు ఉన్నాయో పరిశీలించాల‌ని అన్నారు. బియ్యం ధరలను అదుపులో ఉంచేందుకు బియ్యం నిల్వలను మార్కెట్టులోకి వదిలేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రస్తుతం ఉల్లి ధరలను కంట్రోల్ చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తున్నాం అన్నారు. రానున్న కాలంలో ఉల్లికి ఉన్న డిమాండ్ కు అనుగుణంగా ఉల్లి సాగును ప్రొత్సహించాలని సూచించారు నారా చంద్ర‌బాబు నాయుడు .ఇక పామాయిల్, కందిపప్పు ధరలను అదుపులో పెట్టేలా ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను త్వరితగతిన అమలు చేయాలని అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!