అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆశించిన మేర వర్షాలు లేక పోవడం, ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్ గా దీనిపై ఫోకస్ పెట్టారు. అత్యధికంగా నీరు అవసరం అయ్యే వరి పంట సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలను పండించేలా రైతులను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ మంత్రి, ఉన్నతాధికారులపై ఉందని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో ఆయన స్వయం సహాయక సంఘాలకు తీపి కబురు చెప్పారు. ఇందుకు సంబంధించి వారు కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసేలా, కూరగాయల పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో సమీక్ష చేపట్టారు సీఎం.
కిచెన్ గార్డెన్లను ప్రొత్సహించి వ్యవస్థీకృతం చేయగలిగితే కూరగాయల ధరలు అదుపులో ఉంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకు కనీస మద్దతు ధర అందిస్తుందని, దీనిపై కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. విపత్తులు సంభవించినప్పుడు ఆ ప్రభావం ప్రజలపై పడకుండా చూడటం ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు, వినియోగదారులు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. ఎల్ నినో విపత్తును సవాలుగా స్వీకరించాలని పిలుపునిచ్చారు సీఎం. ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం, రైతు, సాగు నీటి సంఘాలు సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్నాయి.. ఇలా పడుతున్న వర్షాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.