Ananya Reddy: సివిల్స్‌ లో మెరిసిన తెలుగు తేజాలు !

సివిల్స్‌ లో మెరిసిన తెలుగు తేజాలు !

Ananya Reddy: యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్‌ తుది ఫలితాల్లో మహబూబ్‌ నగర్‌ కు చెందిన అనన్య రెడ్డి(Ananya Reddy) సత్తా చాటారు. తొలి ప్రయత్నంలోనే తన అసాధారణ ప్రతిభతో మూడో ర్యాంకు సాధించారు. పదో తరగతి వరకు మహబూబ్‌నగర్‌ గీతం హైస్కూల్‌లో చదివిన అనన్య… ఇంటర్‌ విద్యను హైదరాబాద్‌ లో పూర్తి. ఢిల్లీలోని మెరిండా హౌస్‌ కాలేజీలో డిగ్రీ చదివిన ఆమె ఎటువంటి శిక్షణ తీసుకోకుండానే, సొంతంగా ప్రిపేర్ అయి ఈ ఘనతను సాధించారు.

‘సివిల్స్‌’ పరీక్ష ఎంతో కఠినంతో కూడినది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూలలో ఎదురయ్యే కఠిన సవాళ్లను ఎదుర్కొని నిలవడం ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటిది తొలి ప్రయత్నంలోనే కోచింగ్‌ కూడా తీసుకోకుండా దాదాపు సొంత ప్రిపరేషన్‌ తోనే సివిల్స్‌ లో జాతీయస్థాయిలో మూడో ర్యాంకుతో భళా అనిపించారు అనన్య రెడ్డి. ఇంటర్వ్యూ తర్వాత సివిల్స్‌కు ఎంపిక అవుతానని భావించినప్పటికీ… మూడో ర్యాంకు వస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదని ఆమె చెప్పారు. సొంత ప్రణాళికతోనే రోజుకు 12 నుంచి 14 గంటల పాటు చదివినట్లు తెలిపారు. చిన్నప్పటినుంచే సమాజానికి సేవ చేయాలన్న కోరికతోనే సివిల్స్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు.

Ananya Reddy – కౌశిక్‌ కు 82వ ర్యాంక్ !

సివిల్స్‌ కు ఎంపిక కావడమే లక్ష్యంగా క్యాప్‌ జెమినీలో ఉద్యోగం వదులుకొని మెయిన్స్‌కు ప్రిపేర్‌ అయిన కౌశిక్‌… తొలి ప్రయత్నంలోనే 82వ ర్యాంకుతో సత్తా చాటారు. ఓయూలో సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేసిన ఆయన.. దిల్లీలో ఎంబీఏ చేశారు. అందరూ చదివినట్లే చదివానని.. రోజుకు ఎనిమిది, తొమ్మిది గంటల పాటు ప్రిపేర్‌ అయినట్లు చెప్పారు. ‘‘ఎంబీఏ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు సివిల్స్‌ కు ప్రిపరేషన్‌ మొదలు పెట్టా. ఆ తర్వాత ఏడాది పాటు జాబ్‌ చేశాను. ప్రిలిమ్స్‌ తర్వాత సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం వదిలేసి మెయిన్స్‌ రాశాను. ఐఏఎస్‌ అవ్వాలనేది నా లక్ష్యం. నాకు 100లోపు ర్యాంకు వస్తుందని మాత్రం అసలు ఊహించలేదు. సెలెక్ట్‌ అయితే చాలనుకున్నా.. కానీ.. అదృష్టం, దేవుడి దయవల్లే ఈ ర్యాంకు సాధించా. నాన్న కన్‌స్ట్రక్షన్‌ ఫీల్డ్‌లో పనిచేస్తారు. అమ్మ గృహిణి. నాన్నకు తెలిసిన కొందరు ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లను కలవడం, ఇతరుల గైడెన్స్‌తో పాటు కొన్ని స్టాండర్డ్‌ సోర్సులు నాకు బాగా ఉపయోగపడ్డాయి. నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. ముఖ్యంగా దివ్యాంగుల కోసం, ఆరోగ్య రంగంపై పనిచేయాలని ఉంది’’ అని అన్నారు.

Also Read:KCR: బీజేపీలోకి రేవంత్ జంప్ అవుతారేమో – కేసీఆర్‌

Leave A Reply

Your Email Id will not be published!