హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను ఈ నెల 10 నుండి 18 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు స్పష్టం చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఈ ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖల కార్యదర్శులు, పోలీసు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఈ నెల 18న ట్యాంక్ బండ్ వద్ద వేలాది మంది మహిళలతో ‘సద్దుల బోనాలు’ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక కేంద్రం నుండి ట్యాంక్ బండ్ వరకు బోనాలతో మహిళలు భారీ ఊరేగింపుగా వస్తారని, తెలిపారు. వారితో పాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శిస్తూ ఈ ర్యాలీలో పాల్గొంటారని ఆయన వివరించారు. ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ప్రజా ప్రతినిధులు ఈ బోనాల ఉత్సవానికి హాజరవుతారని పేర్కొన్నారు.
బోనాల వేడుకల శోభను పెంచేందుకు నగరంలోని ప్రధాన కూడళ్లలో బోనాలను ఏర్పాటు చేయడంతో పాటు, అనేక జంక్షన్లలో విద్యుత్ దీపాలతో అలంకరించాలని సీఎస్ ఆదేశించారు. నగరంలోని అన్ని ప్రధాన కార్యాలయాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ట్యాంక్ బండ్ వద్ద జరిగే బోనాల్లో పాల్గొనేందుకు సమీప గ్రామాలు, కాలనీలు , బస్తీల నుండి పెద్ద సంఖ్యలో మహిళలు వస్తారని అంచనా వేస్తున్నందున, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, నెక్లెస్ రోడ్ వెంబడి ఉన్న ట్యాంక్ బండ్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద గల బోనాల ఘాట్ వద్ద బోనాల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని హెచ్‌ఎండీఏ , జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. ట్యాంక్ బండ్ వద్ద సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు బోనాల ఉత్సవాలు జరగనున్నందున, ట్రాఫిక్ మళ్లింపు, బారికేడింగ్ , కనీస వసతుల కల్పన వంటి ఏర్పాట్లు చేయాలని ఆయన పేర్కొన్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా రవీంద్ర భారతిలో పది రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయని ప్రస్తావిస్తూ, అక్కడ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పర్యాటక కేంద్రాలు , ప్రముఖ ప్రాంతాలలో బోనాల ఉత్సవాలను నిర్వహించాలని అన్నారు.
