విజయవాడ : రోజు రోజుకు సాంకేతిక పరంగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సాంకేతిక దినోత్సవం సందర్భంగా మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. 23 ఐఐటీల ద్వారా 5 లక్షల మంది ఐఐటీయన్లు వచ్చారని, ఈ సంఖ్యను చూస్తుంటే సంతోషం కలుగుతోందన్నారు. పాన్-ఐఐటీ ఏపీ 2026 సదస్సులో కీలక అంశాలపై చర్చ జరిగింది. వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించిన వారు కొత్త ఆలోచనలు ఇచ్చారు… టెక్నాలజీ వినియోగం ద్వారా వచ్చే లాభాలపై సమాలోచనలు జరిపారు. అమరావతిలో పాన్ ఐఐటీ వరల్డ్ కౌన్సిల్ పెడుతున్నారు… ఇది ప్రపంచంలో అతి పెద్ద అకాడమియన్ల నెట్ వర్క్ అని తెలిపారు సీఎం. 23 ఐఐటీల నుంచి పెద్ద ఎత్తున ఐఐటీయన్లు అమరావతికి రావడమే మన రాష్ట్రానికున్న బ్రాండ్ కు నిదర్శనం అన్నారు. 5 లక్షల మంది ఐఐటీయన్ల ఆలోచనలను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాభివృద్ధి వేరే స్థాయిలో ఉంటుందన్నారు.
100 స్టార్టప్ మెంటర్లను తయారు చేస్తారని, ఏపీని గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా తయారు చేసేలా ఈ సదస్సు ఉపకరిస్తుందని పేర్కొన్నారు. వివిధ కోర్సుల్లో చేయాల్సిన మార్పులు చేర్పులు.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కరిక్యులంలో మార్పులు తెచ్చేలా ఈ కౌన్సిల్ గైడ్ చేస్తుందన్నారు. హైస్కూల్ స్థాయి నుంచి విద్యార్థుల్లో పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేలా నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకుంటాం అన్నారు. దీనికి ఈ పాన్ ఐఐటీ కౌన్సిల్ సహకరిస్తుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన క్వాంటం కంప్యూటర్ ఆపరేషన్స్ మొదలు కానున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం క్యు శివ పేరుతో క్వాంటం కంప్యూటర్లు తయారు చేశారని, అతి తక్కువ ధరతో క్వాంటం కంప్యూటర్ల ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని సాధించాం అన్నారు.
భారత దేశం, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ యూజర్లుగానే కాదు ప్రొడ్యూసర్లుగా ఉండాలన్నారు. దానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవాలని కోరారు. ఆ స్పూర్తి నుంచే క్వాంటం కంప్యూటర్ల ఉత్పత్తి చేసే ఆలోచనలు వచ్చాయన్నారు సీఎం. వచ్చే రెండేళ్ల కాలంలో కమర్షియల్ క్వాంటం కంప్యూటర్లను ఉత్పత్తి చేస్తామని క్వాంటం సంస్థలు చెబుతున్నాయని తెలిపారు. జాతీయ స్థాయిలో కోటి ఏఐ నిపుణులను సిద్దం చేయాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు . ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా 50 లక్షల మంది ఏఐ నిపుణులను ఏపీ ద్వారా అందించాలని మేం టార్గెట్ పెట్టుకున్నాం అన్నారు. డీప్ టెక్ పాలసీకి పాన్ ఐఐటీ కౌన్సిల్ సలహాలు ఇస్తుందని తెలిపారు. మంచి ఐడియాను అమలు చేస్తే విప్లవాత్మక మార్పులు తప్పకుండా వస్తాయన్నారు.
