రూ. 16,350 కోట్ల‌తో క‌డ‌ప ఉక్కు క‌ర్మాగార నిర్మాణం

పనులు ప్రారంభించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : క‌డ‌ప జిల్లాలో రూ. 16,350 కోట్ల‌తో క‌డ‌ప ఉక్కు క‌ర్మాగార నిర్మాణం ప‌నులు చేప‌ట్ట‌డం ఆనందంగా ఉంద‌న్నారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. శుక్ర‌వారం ఈ సమీకృత ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్ స్టీల్ లిమిటెడ్ సంస్థ 1,100 ఎకరాల విస్తీర్ణంలో భారీపెట్టుబడితో రెండు దశల్లో అభివృద్ధి చేయనుంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఈ పనులను ప్రారంభించారు. కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లి , పెద్దదన్లూరు గ్రామాల్లో జేఎస్ డ‌బ్ల్యు రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనుల‌కు శ్రీ‌కారం చుట్టారు. మొదటి దశలో రూ. 4,500 కోట్ల పెట్టుబడి ఉండగా, రెండవ దశలో అదనంగా రూ. 11,850 కోట్ల పెట్టుబడితో కర్మాగార సామర్థ్యం ఏడాదికి రెండు మిలియన్ టన్నులకు చేరుకుంటుంది. 2028 మార్చి నాటికి వాణిజ్యపరమైన ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఆధునిక ‘గ్రీన్ స్టీల్’ (పర్యావరణ హిత ఉక్కు) కేంద్రంగా రూపొందించబడిన ఈ కర్మాగారం, పునరుత్పాదక ఇంధనంతో నడిచే స్క్రాప్-ఆధారిత ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ సాంకేతికతను వినియోగించు కోవడం ద్వారా కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుంద‌ని చెప్పారు చంద్ర‌బాబు నాయుడు. ఈ ప్రాజెక్ట్‌కు వాస్తవానికి 2019లోనే ఆమోదం లభించిందని, 2019, 2023లలో శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయ‌ని తెలిపారు. 2024లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జేఎస్ డ‌బ్ల్యూ సంస్థ‌తో నిరంతర చర్చల ద్వారా ఈ ప్రాజెక్ట్‌కు మళ్లీ ఊపిరి పోశామ‌ని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన కీలకమైన బాహ్య మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించిందని అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!