బెంగళూరు : కేంద్ర పరిశ్రమల శాఖా మంత్రి జేడీ కుమార స్వామి సంచలన ఆరోపణలు చేశారు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై. ప్రధానంగా సీఎంఓ పై మండిపడ్డారు. శుక్రవారం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. అక్రమ బంగ్లాదేశ్ వలసదారులతో సహా నకిలీ ఓటర్ల నమోదు వెనుక సీఎంఓ హస్తం ఉందన్నారు. దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం ఆదేశాల మేరకు బెంగళూరు దక్షిణ జిల్లాలోని రామనగరలో అక్రమ బంగ్లాదేశ్ వలసదారులతో సహా వేలాది మంది నకిలీ ఓటర్లకు “తప్పుడు” పత్రాలను సమకూర్చి, వారిని ఓటర్ల జాబితాలో చేర్చే ప్రక్రియ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పదే పదే చెబుతూ వచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం చేపట్టిన ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) ప్రక్రియలో భాగంగా ఈ అక్రమాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
రామనగరలో ఓటర్ల వివరాలను ఇంటింటికీ వెళ్లి సరిచూడాల్సి ఉండగా దానికి భిన్నంగా ఒక కమ్యూనిటీ హాల్‌లో ప్రజలను గుమిగూడించి ఈ ప్రక్రియను సామూహికంగా నిర్వహించారని కుమారస్వామి ఆరోపించారు. ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ ఆదేశాల మేరకే ఈ ప్రక్రియ జరిగింది అని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని చేత పట్టుకుని ప్రదర్శించే పార్టీయే ఇప్పుడు దాని స్ఫూర్తిని దెబ్బ తీస్తోందని ఆయన విమర్శించారు. మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి ‘గ్యారెంటీ పథకాల’ ప్రయోజనాలను కోల్పోతామనే భయాన్ని ప్రజల్లో కలిగించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవస్థీకృత అక్రమాలకు పాల్పడుతోందని కుమారస్వామి ఆరోపించారు.
