మావిగన్ తో జగన్ పార్టీని ప్రజలే భూ స్థాపితం చేస్తారు
ఇంధన, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి : శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న ఆంధ్రుల కలల రాజధాని అమరావతిపై జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టాడని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. భారీగా తరలి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సంబంధిత సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టారు. గ్రీవెన్స్ అనంతరం మంత్రి గొట్టిపాటి మీడియాతో మాట్లాడారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన అసెంబ్లీ సమావేశాల సాక్షిగా అమరావతి రాజధాని అయితే తనకు ఎటువంటి ఇబ్బందీ లేదని స్పష్టం చేసిన విషయాన్ని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు.
రైతుల నుంచి 30,000 ఎకరాలు తగ్గకుండా చూడాలని అప్పట్లో జగన్ సలహా ఇచ్చిన విషయాన్నీ ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. అనంతరం తాను ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నా అన్నాడన్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల అనంతరం మూడు రాజధానులు అంటూ కాలయాపన చేశాడని మండిపడ్డారు. మూడు చోట్లా ఒక్క ఇటుక కూడా వేయలేదని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ మూడు రాజధానుల పేరుతో కాలక్షాపం చేసిన జగన్., తన కోసం మాత్రం రూ.450 కోట్లతో ప్యాలెస్ నిర్మించుకున్నాడని మంత్రి గొట్టిపాటి ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రతిపాదించిన మూడు రాజధానులను, ఆ పార్టీ ప్రజలు తిరస్కరించినట్లు తెలిపారు. మూడు రాజధానుల నినాదంతో వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారన్నారు.
ఇప్పుడు జగన్ పిచ్చి చేష్టలు, మావిగన్ వ్యాఖ్యలతో సున్నాతో వైసీపీని భూ స్థాపితం చేస్తారని పేర్కొన్నారు. ఐదేళ్లు సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ పునర్నిమిస్తున్నారని మంత్రి తెలిపారు. రాజధాని ఉండాలంటూ అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం, ఆంధ్రప్రదేశ్ ను మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.
