పెన్షన్ల కోసం చిన్న కుటుంబాలుగా విడి పోవద్దు

కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి : సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం చిన్న కుటుంబాలుగా విడగొట్టకుండా భవిష్యత్తులో అన్ని పథకాలను ఫ్యామిలీ యూనిట్‌గానే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొత్త పెన్షన్ల జారీకి ముందే కుటుంబాల మ్యాపింగ్‌ చేపట్టాలని, ప్రస్తుతం ఉన్న లబ్ధిదారులను యథాతథంగా కొనసాగిస్తూనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. రేషన్‌, పెన్షన్ల కోసం కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మారి పోవడం సరికాదన్నారు. పెద్ద కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఆ కుటుంబానికి ఎక్కువ ప్రయోజనాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇదే ప్రభుత్వ విధానమని.. దానికి అనుగుణంగానే పాలసీలు, కార్యాచరణ ఉండాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు. 8వ కలెక్టర్ల సమావేశం రెండో రోజున శుక్రవారం సూపర్ -6 పథకాలపై కలెక్టర్లకు దిశానిర్ధేశం చేశారు.

కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఐదు కిలోల చొప్పున రేషన్‌ బియ్యం అందించేలా చూడాలని సీఎం సూచించారు. సంక్షేమ పథకాల అమలులో కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని సమగ్ర ప్రయోజనాలు అందించే విధానాన్ని రూపొందించాలన్నారు సీఎం. వివిధ పథకాల్లో ఉన్న లోటుపాట్లను సరిచేసి అత్యుత్తమ విధానాలను త‌యారు చేయాల‌ని ఆదేశించారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల కోసం ఇప్పటి వరకు రూ.1.50 లక్షల కోట్ల మేర ఖర్చు చేశామని చంద్రబాబు తెలిపారు. ఇందులో ఒక్క పెన్షన్లకే రూ.75 వేల కోట్లు వ్యయం చేసినట్లు వెల్లడించారు. ఆర్థిక అసమానతలను తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా సంక్షేమ విధానాలు ఉండాలని అన్నారు. సంక్షేమం నుంచి కుటుంబాలను సాధికారత దిశగా తీసుకెళ్లే ‘వెల్ఫేర్‌ టు ఎంపవరింగ్‌ ఫ్యామిలీస్‌’ విధానంతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. సెర్ప్‌, మెప్మా ద్వారా ‘వన్‌ ఫ్యామిలీ.. వన్‌ ఎంట్రప్రెన్యూర్‌’ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఐదు లక్షల మంది మహిళలను ఎంట్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టామని తెలిపారు. వివిధ సామాజిక వర్గాలను సాధికారత దిశగా తీసుకెళ్లాలి… అందర్నీ అభివృద్ధి చేయాలన్నారు. హాస్టళ్లలోని విద్యార్థులకు నాణ్యమైన ఉత్పత్తులతో పాటు మెరుగైన విద్య అందించాలని స్పష్టం చేశారు. పీ4 కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!