10 ఏళ్లుగా విదేశాంగ విధానం అస్తవ్యస్తం : ప్రియాంక్ ఖర్గే
బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో మంత్రి కీలక వ్యాఖ్యలు
బెంగళూరు : కేంద్ర సర్కార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే. గత 10 ఏళ్లుగా భారత విదేశాంగ విధానం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందన్నారు. గుర్తు చేసుకుంటే భారత ప్రధాని, చైనా ప్రధాని గుజరాత్లో ఊయల ఊగారు, మహాబలిపురంలో చర్చలు జరిపారు, కానీ ఆ తర్వాత ఏమైంది? వారు అరుణాచల్ ప్రదేశ్‌ను ఆక్రమించుకున్నారు అని ఖర్గే అన్నారు. బ్రిక్స్ సదస్సుకు ముందు కేంద్ర విదేశాంగ విధానంపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే శుక్రవారం పలు ప్రశ్నలు లేవనెత్తారు. భారత రూపాయికి సంబంధించి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, చైనా విసిరిన సవాళ్లకు తగిన విధంగా స్పందించ లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ విదేశాంగ విధానం దారి తప్పినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. భారతదేశ ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలను ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరుపై సందేహాలు వ్యక్తం చేశారు.
దశాబ్ద కాలంగా విదేశాంగ విధానం అస్తవ్యస్తంగా ఉంది. చౌకైన రష్యా చమురు కొనుగోలు విషయంలో అమెరికా ఒత్తిడి తెస్తే మీరు వెనక్కి తగ్గుతారు. అదే సమయంలో, మీరు చైనా ప్రధానితో సన్నిహితంగా మెలుగుతుంటే, ఆయన అరుణాచల్ ప్రదేశ్‌ను ఆక్రమించుకుంటారు. ఒకవైపు చైనా యాప్‌లు, వస్తువులపై నిషేధం విధిస్తారు, ఆ తర్వాత మళ్లీ వెనక్కి తగ్గుతారు. కాబట్టి విదేశాంగ విధానం సరైన మార్గంలో ఉందో లేదో నాకు అర్థం కావడం లేదు. గతంలో బ్రిక్స్ సమావేశం జరిగినప్పుడు, రూపాయిని బలోపేతం చేస్తామని, అది ప్రపంచ వ్యాప్తంగా చెలామణి అయ్యే కరెన్సీగా మారుతుందని హామీ ఇచ్చారు. కానీ దానికి భిన్నంగా డాలర్ విలువ పెరిగింది, రూపాయి విలువ భారీగా పడిపోయింది. ఎప్పటిలాగే, భారత విదేశాంగ విధానాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక విదేశాంగ శాఖ , ప్రధాన మంత్రి సతమతమవుతున్నారు అని ఖర్గే ఆరోపించారు.
