శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌కు ఫ‌స్ట్ ప్ర‌యారిటీ : డీజీపీ

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన నూత‌న డీజీపీ సీవీ ఆనంద్

హైద‌రాబాద్ : రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేయ‌డంపై ఫోక‌స్ పెడ‌తామ‌న్నారు నూత‌న డిజీపీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సీవీ ఆనంద్ . ఆయ‌న డీజీపీగా కొలువు తీరిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర డిజిపిగా తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఆశయాలను నెరవేరుస్తూ, ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించేందుకు అహర్నిశలు కృషి చేస్తానని డిజిపి ఈ సందర్భంగా ప్ర‌క‌టించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల దర్యాప్తు పోలీసుల ప్రాథమిక విధులే అయినా, మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను జోడించి వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు.

ప్రధానంగా నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే, జరగక ముందే వచ్చే సంకేతాలను పసిగట్టి అప్రమత్తంగా ఉండటంపై దృష్టి సారిస్తామన్నారు సీవీ ఆనంద్. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అవి జటిలమవుతాయని, అందుకే ముందస్తు నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు. ముఖ్యంగా మహిళల భద్రత, బాలల అక్రమ రవాణా నియంత్రణ వంటి అంశాలపై రాజీ లేని పోరాటం చేస్తామని ప్రకటించారు.నేటి తరం సైబర్ నేరాలు, డ్రగ్స్ ముప్పును ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టడానికి సైబర్ సెక్యూరిటీ బ్యూరోను శక్తివంతం చేస్తామన్నారు. విద్యా సంస్థల్లో ‘యాంటీ డ్రగ్స్ కమిటీల’ను ఏర్పాటు చేసి, యువతను ఈ మహమ్మారి నుండి కాపాడతామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు గానూ రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన నిబంధనలు అమలు చేసేందుకు ప్రత్యేకంగా ‘ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Leave A Reply

Your Email Id will not be published!