విజయవాడ : రాష్ట్రంలో ఆక్వాకల్చర్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రొయ్యల రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం రొయ్యల రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు, సముద్ర ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారులు తదితర రంగ ప్రతినిధులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రొయ్యల ఫీడ్ ధరల పెరుగుదలపై రైతులు, పరిశ్రమ వర్గాలు తమ అభిప్రాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకు వచ్చాయని మంత్రి తెలిపారు. ఫిష్‌మీల్, సోయాబీన్ తదితర ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయాలు అధికమయ్యాయని తయారీ సంస్థలు వివరించగా, ఇప్పటికే ఖర్చుల భారం పెరిగిన నేపథ్యంలో ధరల పెంపును నియంత్రించాలని రైతులు కోరినట్లు చెప్పారు.
ఆక్వాకల్చర్ రంగ సమగ్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైతులు, తయారీదారులు చర్చల ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారానికి రావాలని ప్రభుత్వం సూచించినట్లు తెలిపారు అచ్చెన్నాయుడు. ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలని కోరినట్లు పేర్కొన్నారు. ఫీడ్ ధరల నిర్ణయంలో శాస్త్రీయ విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమైనట్లు మంత్రి వెల్లడించారు. ముడి పదార్థాల ధరలు, టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ)తో పాటు మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో పారదర్శక ధరల వ్యవస్థ ఏర్పాటుపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. .
