ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి 3 లక్షల మంది హాజరు
ఏర్పాట్లను పరిశీలించి, సమీక్షించిన మంత్రి నారా లోకేష్
విజయనగరం జిల్లా : ఉత్తరాంధ్రకే తలమానికంగా రూపు దిద్దుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం)ను ఆగస్టు 1వతేదీన ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్ అనే రీతిలో విజయవంతం చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి 3 లక్షల మంది ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం, ప్రధాని మోదీజీ బహిరంగసభకు హాజరవుతారని తెలిపారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. కూటమి నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రధాని సభను విజయవంతం చేయాలని కోరారు.
ప్రధాని మోదీజీకి ఘన స్వాగతం పలుకుతూ సుమారు 13 వేలమందితో దేశంలోనే అతిపెద్ద ధింసా నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ సభకు హాజరయ్యే ప్రజలకోసం 36 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 5 వేల బస్సులు రానున్నాయి. సభకు వచ్చే వారు బస్సు ఎక్కినప్పటి నుంచి తిరిగి వెళ్లేవరకు ఎటువంటి లోటు లేకుండా మండల స్థాయి లైజన్ ఆఫీసర్లు దగ్గరుండి చూసుకోవాలి. సభకు హాజరయ్యే వారందరికీ తాగునీరు, అల్పాహారం, భోజన సదుపాయం కల్పించాలన్నారు. ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్ల కమిటీ ముఖ్య అధికారి ఎంటి కృష్ణబాబు మాట్లాడుతూ ప్రధాని బహిరంగసభను వీక్షించేందుకు ప్రతి 5 వేలమందికి ఒక ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు. సీనియర్ ఐఎఎస్ అధికారులు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
