హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ఈ తరుణంలో హైదరాబాద్ నగరానికి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో తాగునీటి సరఫరా కోసం సమగ్రమైన మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని ఈ సందర్బంగా ఆదేశించారు. జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు , విలీన మున్సిపాలిటీలలో తాగునీటి సరఫరాలో ఏకరూపత ఉండేలా చూడాలని సీఎం సూచించారు. రాబోయే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ఈ మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని అన్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు.
‘ఎల్ నినో’ ప్రభావంతో వర్షపాతం లోపం ఏర్పడే అవకాశం ఉన్నందున, తాగునీటి సరఫరా విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న తాగునీటి వనరులను గుర్తించి, వాటి వివరాలను (మ్యాపింగ్) నమోదు చేయాలని ఆయన అన్నారు. ఒక వనరు నుండి నీటి సరఫరా సాధ్యం కాని పక్షంలో, ప్రత్యామ్నాయ వనరుల ద్వారా ఆయా ప్రాంతాలకు నీటిని సరఫరా చేయడానికి ఈ మ్యాపింగ్ ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని అనేక ప్రాంతాల్లో చాలా ఏళ్లుగా మూడు లేదా నాలుగు రోజులకోసారి మాత్రమే తాగునీరు సరఫరా అవుతోందని అన్నారు సీఎం. ఇకపై అటువంటి పరిస్థితి కొనసాగకూడదని హెచ్చరించారు. ఆయా ప్రాంతాల్లో రోజు విడిచి రోజు నీటి సరఫరా జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ప్రస్తుతం జరుగుతున్న తాగునీటి సరఫరా నిర్మాణ పనులను ఏడాదిన్నరలోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణ పనుల గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారు. నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా న్యాయపరమైన సమస్యలు తలెత్తితే వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.తాగునీటి సరఫరా మరియు STP నిర్మాణ పనుల పురోగతిపై తనకు నెలవారీ నివేదికలు సమర్పించాలని సీఎం ఆదేశించారు. పనుల పురోగతిని పర్యవేక్షించడానికి ఒక ‘డాష్బోర్డ్’ను ఏర్పాటు చేయాలని అన్నారు.
