హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేసిన తర్వాత, వాటి నాణ్యత, సైజు, ఇతర అంశాలపై ప్రతి విద్యార్థి నుండి వాట్సాప్ ద్వారా అభిప్రాయాలను సేకరిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల నుండి వచ్చే అభిప్రాయాల ఆధారంగానే రాబోయే విద్యా సంవత్సరం నుండి పంపిణీ, రంగులు, ఇతర అంశాలపై నిర్ణయాలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఎంసీహెచ్ఆర్డీలోని బోడి పెవిలియన్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో విద్యార్థులకు యూనిఫాంల పంపిణీపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు అందించే యూనిఫాంల నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఆగస్టు 15 నాటికి పిల్లలందరికీ యూనిఫాంలు అందేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. మహిళా సంఘాల ద్వారా జరుగుతున్న కుట్టుపనిని వేగవంతం చేయడానికి కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సెర్ప్ సీఈఓ దివ్యను ఆయన ఆదేశించారు.
గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ అస్తవ్యస్తంగా జరిగిందని మండిపడ్డారు. ఇప్పుడు మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నందున నాణ్యమైన యూనిఫాంలను అందిస్తామని సీఎం అన్నారు. తాము పేద పిల్లల కోసం పని చేస్తున్నామన్న విషయాన్ని అధికారులు గుర్తుంచు కోవాలని సూచించారు. రాబోయే విద్యా సంవత్సరంలో జూన్ 2 నాటికి విద్యార్థులకు యూనిఫాంలు అందేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, సీఎం ప్రధాన కార్యదర్శి ఎన్. శ్రీధర్, సీఎం ఓఎస్‌డీ వేముల శ్రీనివాసులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
