వరద ముప్పు లేకుండా చూడండి : ఏవీ రంగ‌నాథ్

పూడికతీత పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో వ‌ర‌ద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సంద‌ర్శించారు. వరద కాలువల పునరుద్ధరణ పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. గచ్చిబౌలి చౌరస్తా సమీపంలోని ఖాజాగూడ చెరువుకు వెళ్లే వరద కాలువల‌ను పరిశీలించారు. ఈ వర్షాకాలం ప్రారంభంలో ‘ప్రెస్టన్ ప్రైమ్ మాల్’ ముందు నీరు నిలిచి పోయిన ప్రాంతాల్లోని ప్రస్తుత పరిస్థితిని చూశారు. ఖాజాగూడ చెరువుకు వెళ్లే బాక్స్ డ్రైయిన్లలో పూర్తిగా పూడికతో నిండిపోయిన ఒక ‘వెంట్’ (నీరు వెళ్లే మార్గం)ను ఆయన తనిఖీ చేశారు. అక్కడ పూడికతీత పనులను వేగంగా చేపట్టాలని ఆయన ఆదేశించారు. అలాగే, ఆ ​​బాక్స్ డ్రైయిన్‌కు అనుసంధానంగా ఉన్న ఎగువ ప్రాంతంలోని వరద కాలువలను కూడా పరిశీలించారు. అక్కడ తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ఇటీవలి వర్షాల సమయంలో ఎక్కడా నీరు నిలిచి పోలేదని, పాత బొంబాయి హైవే మీదుగా వెళ్లే బాక్స్ డ్రైయిన్ల రెండు వెంట్లలోని పూడికను పూర్తిగా తొలగిస్తే వరద ముప్పు ఉండదని అధికారులు కమిషనర్‌కు వివరించారు.

అంతకు ముందు కొండాపూర్ చౌరస్తాలోని ఏఎంబీ మాల్ ఎదురుగా ఉన్న అండర్‌పాస్‌లో ఇటీవలి వర్షాల వల్ల నీరు నిలిచి పోవడానికి గల కారణాలను ఏవీ రంగ‌నాథ్ తెలుసుకున్నారు. రెండు ఆటోమేటిక్ పంపులు (నీటిని తోడే యంత్రాలు) పని చేయక పోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని అధికారులు తెలపగా, వాటిని వెంటనే బాగు చేయాలని ఆయన సూచించారు. ముఖ్యమైన అండర్ పాస్‌లలో నీరు నిలిచిపోతే మొత్తం ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని, అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని క‌మిష‌న‌ర్ ఆదేశించారు. వరద నీరు నిలిచి పోకుండా నివారించడానికి ఇక్కడ హైడ్రాకు చెందిన 25 హెచ్ పీ పంపులను అందుబాటులో ఉంచాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో హైడ్రా కమిషనర్‌తో పాటు అదనపు కమిషనర్ వర్ల పాప‌య్య‌, అలాగే ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!