న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. డీప్‌ఫేక్ వీడియో వ్యవహారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపిత నకిలీ వీడియోను రూపొందించడం, ప్రచారం చేయడం లేదా విస్తృతం చేయడంలో పాల్గొన్న వారందరిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామనిపేర్కొన్నారు. ఇదిలా ఉండగా పార్లమెంటు వెలుపల మీడియాతో తాను చేసిన వ్యాఖ్యలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి దురుద్దేశ పూర్వకంగా మార్చి, ఒక డీప్‌ఫేక్ వీడియోను సృష్టించి ప్రచారం చేశారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శనివారం ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా స్పందించారు. 25న తెల్లవారుజామున 4:35 గంటలకు చాణక్యపురి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైందని గోయల్ వెల్లడించారు.
తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నంలో భాగంగా ఇది జరిగిందని, ఏఐని ఉపయోగించి నా వ్యాఖ్యలను దురుద్దేశ పూర్వకంగా మార్చి డీప్‌ఫేక్ వీడియోను సృష్టించి ప్రచారం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నకిలీ వీడియో తయారీ, ప్రచారం లేదా విస్తరణలో భాగమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను బాధ్యతా రాహిత్యంగా దుర్వినియోగం చేయడాన్ని సహించే ప్రసక్తి లేదన్నారు. ప్రధానంగా తమకు కావాల్సిన సమాచారం కోసం ధృవీకరించ బడిన, విశ్వసనీయమైన వనరులపై మాత్రమే ఆధారపడాలని గోయల్ ప్రజలను కోరారు.
