Gujarat Cabinet: గుజరాత్ మంత్రుల మూకుమ్మడి రాజీనామా

గుజరాత్ మంత్రుల మూకుమ్మడి రాజీనామా

Gujarat Cabinet : గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన మంత్రులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, మరికాసేపట్లో గవర్నర్‌ను ముఖ్యమంత్రి భూపేంద్ర కలవనున్నారు. అయితే మంత్రివర్గ (Gujarat Cabinet) పునర్వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించడంతో మంత్రులంతా రాజీనామా చేయాల్సి వచ్చింది. శుక్రవారం కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ‘గుజరాత్ (Gujarat) ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మంత్రివర్గాన్ని శుక్రవారం మధ్యాహ్నం 12:39 గంటలకు విస్తరించనున్నారు’ అని వెల్లడిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

Gujarat Cabinet Ministers Resign

అయితే, మంత్రివర్గ విస్తరణలో భాగంగా సగం మంది వరకూ పాత మంత్రులే ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే 10 మంది వరకూ కొత్త వారిని మంత్రులుగా తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ధర్మేంద్ర సిన్హ్, రిషికేశ్ పటేల్, ముఖేష్ పటేల్, భూపేంద్రసింగ్ చుడాసమా తిరిగి తమ మంత్రి పదవులను దక్కించుకునే అవకాశం ఉందని… అలాగే కనుభాయ్ దేశాయ్, రాఘవ్జీ పటేల్, కున్వర్జీ బవలియా, మురుభాయి బెరా స్థానంలో కొత్త వారిని తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, ప్రస్తుతం గుజరాత్ మంత్రివర్గంలో సీఎం పటేల్ సహా 17మంది మంత్రులు ఉన్నారు. ఎనిమిది మంది క్యాబినెట్ స్థాయి మంత్రులు కాగా.. మిగతా వారు సహాయ మంత్రులుగా ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీలో మెుత్తం 182 మంది సభ్యులు ఉన్నారు. ఈ 182 మంది సభ్యులున్న అసెంబ్లీలో 27 మంది లేదా మొత్తం సభలో 15శాతం మంది మంత్రులు ఉండొచ్చు.

మరోవైపు నూతన మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరవుతారని భావిస్తున్నారు. ఈ మేరకు గురువారం నాటికి బీజేపీ ఎమ్మెల్యేలంతా గాంధీనగర్‌కు చేరుకోవాలని పార్టీ సైతం ఆదేశాలు జారీ చేసింది. అయితే, మంత్రి పదవులు ఎవరెవరికి దక్కుతాయనే అంశం ఇప్పుడు గుజరాత్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read : CBI: అవినీతి కేసులో పంజాబ్ డీఐజీ హర్‌చరణ్ సింగ్ అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!