అమరావతి : మాజీ సీఎం జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్. సవిత. ఆయనకు దమ్ము, ధైర్యం, ఖలేజా ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. గురువులను దైవంగా కొలుచుకునే సమాజం మనది. అటువంటి దైవాలపై గొడ్డలి పార్టీ గూండాలు దాడి చేయడం దారుణం అన్నారు. ఒకవైపు లిక్కర్ స్కామ్, మరో వైపు గ్రూప్ 1 పోస్టుల మూల్యాంకనంలో అక్రమాలు బయటకు రావడంతో జగన్ బ్యాచ్ లో గగ్గోలు మొదలైందన్నారు. టీచర్ల ఆత్మగౌరం దెబ్బతిసేలా, వారిని కష్టాన్ని తక్కువ చేసి చూపేలా మెగా డీఎస్సీలో అక్రమాలు అంటూ విష ప్రచారం మొదలు పెట్టారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ…టీచర్లపైనా, సామాన్యులపైనా దాడులు చేస్తే ఊరుకోబోమని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని , తాట తీస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ కు దమ్ము, ధైర్యం ఉంటే మెగా డీఎస్సీ, గ్రూప్ 1 పోస్టుల మూల్యాంకనంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైసీపీ కార్యకర్తలను జగన్ రెడ్డి పావులుగా వాడుకుంటున్నారన్నారు. ఆయన మాటలు నమ్మి దాడులకు తెగబడితే నష్టపోయేది వైసీపీ కార్యకర్తలేనన్నారు.
పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత మాట్లాడారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డికి తమకష్టాలు చెప్పుకోడానికి వచ్చిన టీచర్లపై గొడ్డలి పార్టీ గూండాలు దాడులు చేయడం బాధాకరమన్నారు. 2025 మెగా డీఎస్సీలో టీచర్ అభ్యర్థులు రేయింబవళ్లు కష్టపడి లక్ష్యం సాధించారన్నారు. అటువారి కష్టాన్ని తక్కువ చేసి చూపుతూ, ఆత్మగౌరవం కించపరిచేలా నీలి మీడియాలో విషపు రాతలు రాస్తూ గొడ్డలి పార్టీ నాయకులు రాక్షాసానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మంత్రి నారా లోకేశ్ ఎంతో పారదర్శకంగా, అక్రమాలకు తావులేకుంటే 2025 మెగా డీఎస్సీ నిర్వహించారని మంత్రి సవిత కొనియాడారు. స్పోర్ట్స్ కోటాలోగాని, మరే కోటాలోగాని ఎటువంటి అక్రమాలు జరగలేదని హైకోర్టు, విద్యా శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారన్నారు. కనీస అవగాహన కూడా లేకుండా జగన్, గొడ్డలి పార్టీ నాయకులు మెగా డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.