చెన్నై : భారతీయ సినిమాను షేక్ చేసిన దర్శక, నటుల్లో శంకర్, కమల్ హాసన్ ఒకరు. ఈ ఇద్దరు కలిసి చేసిన సినిమా భారతీయుడు. ఇది సంచలనం సృష్టించింది. తాజాగా దర్శకుడు శంకర్ సంచలన ప్రకటన చేశారు. ‘ఇండియన్ 3’ సేనాపతిగా కమల్ హాసన్ పునరాగమనాన్ని ధృవీకరించారు. శంకర్ ‘ఇండియన్ 3’ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇందులో కమల్ హాసన్ మళ్లీ సేనాపతి పాత్రలో కనిపించనున్నారు. ఐకానిక్ ‘ఇండియన్’ ఫ్రాంచైజీలో తదుపరి అధ్యాయంగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు శంకర్ కెరీర్‌లో కమల్ హాసన్ఇం డియన్ 2, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలు పెద్ద ఎదురు దెబ్బలుగా నిలిచాయన్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేయడంతో శంకర్ కొంతకాలం విరామం తీసుకోవాల్సి వచ్చింది.
కానీ ఇప్పుడు ఆయన ఘనంగా పునరాగమనం చేస్తున్నారు. ‘ఇండియన్ 2’తో పాటే ప్రకటించిన ‘ఇండియన్ 3’ని పక్కన పెట్టేశారని చాలామంది భావించారు. కానీ శంకర్ తాను మొదలు పెట్టిన ఈ ఫ్రాంచైజీతో బలమైన పునరాగమనానికి సిద్ధమయ్యారు. తాజాగా కమల్ హాసన్ సేనాపతిగా నటించే ‘ఇండియన్’ సిరీస్‌లోని మూడవ భాగాన్ని ఆయన ప్రకటించారు. చిత్ర బృందం కూడా ఈ పెద్ద వార్తను సోషల్ మీడియాలో పంచుకుని అభిమానులకు శుభవార్త అందించింది. ఇండియన్ -3 కఠిన వైఖరితో తిరిగి వచ్చాడు. ఇండియన్ 2’లా కాకుండా ఈ సినిమా కేవలం కమల్ హాసన్ పోషించిన సేనాపతి పాత్రపైనే కాకుండా, సేనాపతి తండ్రి వీరశేఖరన్ బలరామ్ (ఈ పాత్రను కూడా కమల్ హాసనే పోషిస్తున్నారు) కథను కూడా ఆవిష్కరించనుంది. ఆయన కూడా ఒక స్వాతంత్ర సమరయోధుడు. ఈ పోస్ట్ ద్వారా ‘ఇండియన్ 3’ పోస్ట్-ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని చిత్ర బృందం ధృవీకరించింది.
