బెంగళూరు : కర్ణాటక శాసనసభలో కస్తూరి రంగన్ సమర్పించిన నివేదికపై తీవ్రంగా చర్చ జరిగింది. దీనిపై పలువురు సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వం క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి ప్రతి గ్రామానికి వెళ్లి, తోటలు , ఇళ్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించి ఒక నివేదికను రూపొందించిందని ఆర్. అశోక్ పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వే వల్ల పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతం విస్తీర్ణం తగ్గడమే కాకుండా, బఫర్ జోన్ విస్తీర్ణం సున్నాకి తగ్గిందని ఆయన గుర్తుచేశారు. అలాగే సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు పర్యావరణంపై అవగాహన ఉన్న సమర్థులైన న్యాయవాదులను నియమించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పశ్చిమ కనుమలపై కస్తూరిరంగన్ కమిటీ నివేదిక ప్రకారం పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతం విస్తీర్ణాన్ని తగ్గించేందుకు, గ్రామాల్లో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించిన కేరళ విధానాన్ని కర్ణాటక ప్రభుత్వం అనుసరించాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక్ డిమాండ్ చేశారు.
శాసనసభలో కస్తూరిరంగన్ నివేదికపై మాట్లాడారు. తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పారు. ఆ నివేదికను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ , కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారని, కేరళ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగానే అక్కడ సున్నితమైన ప్రాంతం విస్తీర్ణం తగ్గిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధానాన్ని పాటిస్తే, మన రాష్ట్రంలోని ప్రజల తోటలు , ఇళ్లు రక్షించ బడతాయని పేర్కొన్నారు. పశ్చిమ కనుమలు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ , తమిళనాడు రాష్ట్రాల మీదుగా 1,64,280 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. కస్తూరిరంగన్ నివేదిక ప్రకారం కర్ణాటకలోని 1,576 గ్రామాలు (20,668 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం) పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతం పరిధిలోకి వస్తాయి. ఈ నివేదికను అమలు చేస్తే ఈ ప్రాంత ప్రజలకు వినాశకరమైన పరిణామాలు ఎదురవుతాయన్నారు.
ఎందుకంటే దీనివల్ల గ్రామాల్లో రోడ్ల నిర్మాణం సాధ్యం కాదు, కూలిపోయిన వంతెనలను మరమ్మతు చేయడం కుదరదు, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం వంటి పనులు కూడా నిలిచి పోతాయి. పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాన్ని తగ్గించడమే కాకుండా, బఫర్ జోన్ పరిధిని కూడా సున్నాకి తగ్గించిన కేరళ ప్రభుత్వ క్షేత్రస్థాయి సర్వే నివేదికను ఆర్. అశోక్ ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు పర్యావరణంపై అవగాహన ఉన్న సమర్థులైన న్యాయవాదులను నియమించాలని అన్నారు. కస్తూరి రంగన్ నివేదికపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను మరో వారం రోజుల పాటు పొడిగించాలని ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.