కర్ణాటక సర్కార్ కు ఎమ్మెల్యే హెచ్. కె. పాటిల్ డెడ్ లైన్
గడగ్ ను కరువు జిల్లాగా ప్రకటించాలి లేక పోతే గుడ్ బై
బెంగళూరు : అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు తన పార్టీకి చెందిన సీనీయర్ నాయకుడు, ఎమ్మెల్యే హెచ్ కె పాటిల్ వ్యవహారం ఇప్పుడు తలనొప్పిగా మారింది. ఇప్పటికే మంత్రివర్గంలో కొందరికి చోటు దక్కక పోవడంతో పలువురు ఆశావహులు ఆగ్రహంతో ఉన్నారు. ఇదిలా ఉండగా పాటిల్ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన గడగ్‌ను కరువు పీడిత జిల్లాగా ప్రకటించే అంశంపై పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇందుకు సంబంధించి సర్కార్ కు గడువు కూడా ఇచ్చారు. అక్టోబర్ 2 వరకు వేచి చస్తానని ఆ తర్వాత తాను సంచలన ప్రకటన చేస్తానని తెలిపారు. తన డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోక పోతే 2 నుంచి 10 లోపు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు పాటిల్.
ఆయన గతంలో మంత్రిగా కూడా పని చేశారు. గడగ్‌ను కరువు పీడిత ప్రాంతాల జాబితాలో చేర్చాలని కోరుతూ గాంధీ జయంతి వరకు తన ప్రయత్నాలను కొనసాగిస్తానని ఆయన చెప్పారు. హెచ్.కె. పాటిల్ అసెంబ్లీలో గడగ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన పాటిల్ కరువు పీడిత ప్రాంతాన్ని ప్రకటించడానికి నిర్దేశించిన మార్గదర్శకాలను సంబంధిత అధికారులు ‘తప్పుగా అర్థం చేసుకున్నారని’ ఆరోపించారు; 49 శాతం వర్షపాత లోటు ఉన్నప్పటికీ గడగ్ అంశాన్ని అధికారులు “పక్కన పెట్టారని” ఆయన పేర్కొన్నారు. గడగ్‌ను కరువు పీడిత ప్రాంతంగా గుర్తించాలని ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ పని జరగలేదని ఆరోపించారు.
దీని వెనుక ఉన్న తర్కం ఏమిటో నాకు అర్థం కావడం లేదని పాటిల్ అసహనం వ్యక్తం చేశారు. ఈ సీజన్‌లో తక్కువ వర్షపాతం కారణంగా ఏర్పడిన పరిస్థితులను పరిశీలించేందుకు సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి గడగ్‌ను సందర్శించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు; తక్కువ వర్షపాతం వల్ల రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన పరిస్థితిని ముఖ్యమంత్రి స్వయంగా గమనించి ఆందోళన చెందారని ఆయన తెలిపారు.
