అంగ రంగ వైభవోపేతం శ్రీవారి రథోత్సవం

తిరుమాడ వీధుల‌న్నీ గోవింద నామ జ‌ప‌మే

తిరుమ‌ల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఉభయ దేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం ఘ‌నంగా జ‌రిగింది. వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని రథాన్ని లాగి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు . శ్రీమలయప్ప స్వామివారిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. స్వామివారు రథంపై విహరిస్తుండగా భక్తులు అడుగడుగునా హారతులు సమర్పిస్తూ, “గోవిందా.. గోవిందా” అంటూ భక్తి పారవశ్యంలో మునిగి పోయారు. గోవింద నామ స్మరణతో తిరుమాడ వీధులు మారుమోగాయి.

అనాది కాలం నుంచి రాజులకు రథ సంచారం ప్రసిద్ధమైంది. యుద్ధాల్లోనూ రథాలను విరివిగా ఉపయోగించినట్లు భారతాది ఇతిహాసాలు, పురాణాలు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడని ఆర్ష గ్రంథాలు పేర్కొంటున్నాయి. ప్రసిద్ధ దేవాలయాల్లో ఉత్సవమూర్తులను రథంపై అధిష్ఠింపజేసి ఊరేగించే సంప్రదాయం ఆగమ శాస్త్ర సమ్మతంగా కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి రథోత్సవం విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. “రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే” అనే ఆర్షవాక్యం రథంపై కొలువుదీరిన శ్రీకేశవుని దర్శనం పరమ పవిత్రమైనదని తెలియ జేస్తోంది.

భక్తులు రథానికి కట్టిన తాళ్లను పట్టుకుని స్వామివారి రథాన్ని ముందుకు లాగుతూ భక్తి పరవశ్యంలో మునిగి పోయారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, రథోత్సవం సురక్షితంగా జరిగేలా టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రథోత్సవానికి విశిష్టమైన తాత్త్విక సందేశం కూడా ఉంది. కఠోపనిషత్తులో ఆత్మను రథికుడిగా, శరీరాన్ని రథంగా, బుద్ధిని సారథిగా, మనస్సును పగ్గాలుగా, ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణించారు. ఇంద్రియాలకు విషయాలే మార్గాలుగా పేర్కొంటూ ఆత్మ–అనాత్మ వివేకాన్ని ఉపదేశించింది.

రథోత్సవం భక్తులకు ఈ ఆధ్యాత్మిక తత్త్వాన్ని గుర్తు చేస్తుంది. భక్తులు రథాన్ని లాగుతున్నప్పటికీ, సకల జీవుల్లో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన భక్తులను అనుగ్రహిస్తూ తన రథాన్ని తానే నడిపిస్తున్నాడనే భావన ఈ ఉత్సవంలో అంతర్లీనంగా ఉంది. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో శ సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవో డా. ఎ. శరత్, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణ, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!