MP Ganeshamurthi: లోక్‌ సభ ఎన్నికల టికెట్‌ రాలేదని మనస్తాపానికి గురై ఎంపీ ఆత్మహత్య !

లోక్‌ సభ ఎన్నికల టికెట్‌ రాలేదని మనస్తాపానికి గురై ఎంపీ ఆత్మహత్య !

MP Ganeshamurthi: లోక్‌ సభ ఎన్నికల ముందు తమిళనాడులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. లోక్ సభ ఎన్నికల్లో తనకు టిక్కెట్టు కేటాయించలేదని మనస్తాపానికి గురై ఈరోడ్‌ ఎంపీ, మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (ఎండీఎంకే) నేత గణేశమూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మార్చి 24న విషపూరిత ట్యాబ్లెట్లు మింగి ఎంపీ ఆత్మహత్యకు యత్నించిన ఎంపీ గణేశమూర్తి… కోయంబత్తూర్‌ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకే కూటమిలో ఎండీఎంకే కు ఈరోడ్‌ స్థానం దక్కింది. అక్కడి నుంచి గణేశమూర్తి… ఉదయించే సూర్యుడి (డీఎంకే) గుర్తుపైనే పోటీ చేసి విజయం సాధించారు. అయితే, ప్రస్తుత ఎన్నికల్లో కూటమి సర్దుబాట్లలో భాగంగా ఎండీఎంకేకు తిరుచ్చి కేటాయించగా… అక్కడి నుంచి దురైవైగోను పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది.

MP Ganeshamurthi Sucided

దీనితో గణేశమూర్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే మార్చి 24న ఉన్నట్టుండి ఆయన అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చేర్చారు. విషపూరిత ట్యాబ్లెట్లు మింగి ఎంపీ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ తర్వాత పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం ఉదయం కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.

1947 జూన్‌లో జన్మించిన గణేశమూర్తి(MP Ganeshamurthi)… 1993లో ఎండీఎంకే ప్రారంభమైనప్పటి నుంచి ఇదే పార్టీలో ఉన్నారు. 1998లో తొలిసారిగా పళని లోక్‌ సభ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభ సభ్యుడిగా వ్యవహరించిన ఆయన… 2009లో ఈరోడ్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో ఓటమి పాలై… గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి దాదాపు 2లక్షల భారీ మెజార్టీతో మరోసారి విజయం సాధించారు. 2016లో పార్టీ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు.

Also Read : YSR Pension Kanuka: పింఛన్ల పంపిణీపై వాలంటీర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు !

Leave A Reply

Your Email Id will not be published!