యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్ప‌త్తి ప్రారంభించాలి

స్ప‌ష్టం చేసిన ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : దసరా లోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తికి అవసరమైన జీ-9 గ్రేడ్ బొగ్గు విషయంలో తక్షణమే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రితో చర్చించాలని ఉప ముఖ్యమంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌కు సూచించారు. విద్యుత్ శాఖపై ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. యాదాద్రి థర్మల్ కేంద్రంలో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి చేయక పోవడంపై ఈ సందర్భంగా అధికారులను ప్రశ్నించారు. ఉత్పత్తికి G-9 గ్రేడ్ బొగ్గు అవసరమని అధికారులు వివరించారు. సింగరేణిలో జీ 9 గ్రేడ్ బొగ్గు ఉత్పత్తి చేసే బ్లాకులు లేవని, సమీప భవిష్యత్తులోనూ సింగరేణి నుంచి జీ 9 బొగ్గు ఉత్పత్తి అయ్యే అవకాశం లేదని తెలిపారు.

జీ 9 గ్రేడ్‌ బొగ్గు లభ్యత లేనప్పుడు ఆ సాంకేతికతపై ఆధారపడిన యాదాధ్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఎలా నిర్మించారని ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అధికారులను ప్రశ్నించారు. పిట్ హెడ్ (బొగ్గు గనుల పైనే విద్యుత్ కేంద్ర నిర్మాణం కాకుండా థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ను ఎందుకు దూరంగా నిర్మించారని అడిగారు. ఈ కేంద్రానికి బొగ్గు సరఫరా చేయడం వల్ల రాష్ట్రంపై పడే అదనపు భారం ఎంత అని ప్రశ్నించారు సీఎం.అప్పట్లో రాజకీయ కారణాలతోనే పిట్ హెడ్‌పై కాకుండా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం దూరంగా నిర్మించారని తెలిపారు. యాదాద్రికి బొగ్గు సరఫరాతో తెలంగాణ రాష్ట్రంపై రూ. 40 వేల కోట్ల అదనపు భారం పడుతోందని చెప్పారు. సింగరేణి నుంచి జీ-9 గ్రేడ్ బొగ్గుకు ఉన్న అవకాశాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. గత ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనక పోవడంతో జీ-9 గ్రేడ్ బొగ్గును సింగరేణి నుంచి సరఫరా చేయలేదని వివరణ ఇచ్చారు. సింగ‌రేణిలో ఇప్పటికే 14 బొగ్గు బ్లాకులు మూత పడ్డాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ అవసరాల దృష్ట్యా మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి బొగ్గు కొనుగోలుకు చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు.

Leave A Reply

Your Email Id will not be published!