Prashanth Neel Comment : డైరెక్టర్ కంటెంట్ కింగ్ మేకర్
వెండి తెరపై ప్రశాంత్ సంచలనం
Prashanth Neel Comment : సినిమా అన్నది అత్యంత బలమైన , శక్తివంతమైన సాధనం. దీనిని ఎవరూ కాదనలేని సత్యం. రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతూ ఎప్పటికప్పుడు అంది వచ్చిన సాంకేతికతను జోడిస్తూ ముందుకు వెళుతోంది సినిమా రంగం. ఏ ఒక్కరి వల్లనో సినిమా అన్నది నడవదు. దీని వెనుక వందలాది మంది శ్రమ, వేలాది మంది భాగం పంచుకుంటే తెరపైకి వస్తుంది. సాంకేతిక వర్గాన్ని పక్కన పెడితే కథ, కర్మ, క్రియ అంతా దర్శకుడే. సక్సెస్ అయ్యిందా తను బతికి బయట పడ్డట్టే. లేదంటే పతనం అంచుల్లోకి వెళ్లినట్టే. ప్రస్తుతం భారతీయ సినిమా రంగంలో దక్షిణాదికి చెందిన దర్శకుల హవా కొనసాగుతోంది. ఒకరి వెంట మరొకరు సినిమాలు తీస్తూ దుమ్ము రేపుతున్నారు. అంతా ఔత్సాహికులైన ప్రతిభావంతులైన డైరెక్టర్లు ఉండడం విశేషం. ఎస్ఎస్ రాజమౌలి ప్రభాస్ తో తీసిన బాహుబలి తో ఒక్కసారిగా ముంబై మాఫియా కనుసన్నలలో నడిచే బాలీవుడ్ ఉలిక్కి పడింది.
Prashanth Neel Comment Viral
ఆ తర్వాత తను తీసిన ఆర్ఆర్ఆర్ రికార్డుల మోత మోగించింది. ఇక టాలీవుడ్ కు చెందిన సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన పుష్ప ది రైజ్ సినీ లోకాన్ని షేక్ చేసేసింది. ఏదో ఒక రోజు పాన్ ఇండియా మూవీతో తన పేరు చూసు కోవాలని యావత్ ప్రపంచం తన వైపు చూసుకోవాలని కలలు కన్నాడు తమిళ సినీ రంగానికి చెందిన అట్లీ కుమార్. తను బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో తీసిన జవాన్ కోట్లు కొల్లగొట్టింది.
వీళ్లతో పాటు మరికొందరు యువ దర్శకులు సినిమాలు తీస్తూ దూసుకు వెళుతున్నారు. ప్రత్యేకించి వారిలో వెరీ వెరీ స్పెషల్ పా రంజిత్ . తను విక్రమ్ తో తీసిన మూవీ మరో సంచలనానికి రెడీగా ఉంది. ఇక టాలీవుడ్ కు చెందిన వంగా సందీప్ రెడ్డి హిందీలో రణ్ బీర్ కపూర్ , రష్మిక మందన్నాతో తీసిన యానిమల్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సమయంలో ఉన్నట్టుండి మరోసారి తళుక్కున మెరిశాడు శాండిల్ వుడ్ కు చెందిన డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel). కోలార్ గనుల అంశాన్ని కథగా తీసుకుని తెరపై విశ్వ రూపం ప్రదర్శించేలా చేశాడు.
అదే యశ్ తో తీసిన కేజీఎఫ్ . రికార్డులను తిరగ రాసింది. అన్ని వర్గాల ప్రజలను మెస్మరైజ్ చేసింది. సినిమా అన్నది ఇంత గొప్పగా, అద్భుతంగా తీయ వచ్చా అనేలా తీశాడు..నీల్ మెప్పించాడు. ఎమోషన్స్ తో పాటు ఉత్కంఠ భరితంగా తీయడంలో తనకు సాటి లేదనే రీతిలో తెర కెక్కించే ప్రయత్నం చేశాడు . ఈ సినిమా ఇండియన్ సినిమాను షేక్ చేసింది. స్క్రీన్ ప్లే , టేకింగ్ , మేకింగ్ లో తనదైన ముద్ర కనబరుస్తూ వచ్చిన ప్రశాంత్ నీల్(Prashanth Neel) డార్లింగ్ ప్రభాస్ తో సలార్ తీశాడు. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ చిత్రం. ఎక్కడ చూసినా దీని గురించిన ప్రస్తావనే. సామాజిక మాధ్యమాలన్నీ సలార్ ను పలవరిస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా గేలి చేసిన వాళ్ల నోళ్లన్నీ మూత పడేలా చేశాడు ప్రశాంత్ నీల్. సినిమా పరంగా హీరో, హీరోయిన్లు ముఖ్యం కాదని కథే ప్రధానమని చాటి చెప్పాడు. మొత్తంగా మనోడు గట్టోడని నిరూపించు కున్నాడు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తూ..బద్దలు కొడతాడో వేచి చూడాలి.
Also Read : Telangana Assembly Comment : అసెంబ్లీ అంటే అరుపులేనా