Telangana Assembly Comment : అసెంబ్లీ అంటే అరుపులేనా

తీరు మార‌ని నేత‌లు

Telangana Assembly Comment : ఆద‌ర్శంగా ఉండాల్సిన వాళ్లు స‌భ్య‌త‌, సంస్కారం మ‌రిచి ప్ర‌వ‌ర్తిస్తే ఎలా. శాస‌న స‌భ అంటే ప్ర‌జా దేవాల‌యంగా భావిస్తారు. గ‌తంలో పార్ల‌మెంట్ ఉభయ స‌భ‌లు కానీ రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీలో నిర్ణ‌యాత్మ‌కమైన పాత్ర పోషించేందుకు ప్ర‌య‌త్నం చేసే వారు ఎన్నికైన ఎమ్మెల్యేలు(MLA’s). కానీ ఇవాళ ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం, స‌వాళ్లు విస‌ర‌డం ప‌రిపాటిగా మారింది. ఒక ర‌కంగా సినిమాను త‌ల‌పింప చేస్తున్నాయి స‌మావేశాలు. ఎవ‌రు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాకుండా పోతోంది. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి దిగిజారి పోయారు. శాస‌న స‌భ‌లో ప్ర‌జ‌లకు ఏం కావాలో, రాష్ట్రానికి సంబంధించి ఏం చేయాల‌నే దానిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాల్సిన అవ‌స‌రం ఉంటుంది. కానీ రాను రాను స‌మావేశాలు పూర్తిగా మొక్కుబ‌డిగా మారుతున్నాయ‌న్న అప‌వాదు నెల‌కొంది.

Telangana Assembly Comment Viral

అంశాల వారీగా చ‌ర్చించకుండా కేవ‌లం వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు తావు ఇవ్వ‌డం ఒకింత డెమోక్ర‌సీకి మింగుడు ప‌డ‌ని అంశం. ఒక‌నాడు శాస‌న స‌భ జ‌రిగే కంటే ముందు ప్ర‌జా ప్ర‌తినిధులు తాము ఏయే అంశాల‌ను ప్ర‌స్తావించాల‌ని అనుకున్నారో వాటి గురించి ఇంటి వ‌ద్ద కూర్చుని క‌స‌ర‌త్తు చేసేవారు. ఒకానొక స‌మ‌యంలో రాత్రి పొద్దు పోయాక వ‌ర‌కు కూడా వేచి ఉండే వారు. చ‌ట్టాల గురించి, శాస‌న స‌భ నిర్మాణం గురించి కూలంకుశంగా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసే వారు. అంతే కాదు ఆయా అంశాల‌పై ప‌ట్టు క‌లిగిన మేధావులు, అధ్యాప‌కులతో, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల‌తో ములాఖ‌త్ అయ్యే వాళ్లు. ప్ర‌ధాన స‌మ‌స్య‌లు, అంశాల‌కు సంబంధించి పూర్తిగా నోట్స్ రాసుకునే వారు. అన్నీ అర్థం చేసుకున్నాక స‌భ‌లో ప్ర‌శ్న‌లు సంధించే వారు. ఆయా శాఖ‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంత్రులు పూర్తి బాధ్య‌తాయుతంగా స‌మాధానాలు ఇచ్చే వారు. లేదంటే రాత పూర్వ‌కంగా వారి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చే వారు.

కానీ ఇప్పుడు సీన్ మారింది. ఎమ్మెల్యేలు(MLA’s) కేవ‌లం స్టేట‌స్ సింబ‌ల్ గా మారింది. త‌మ ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించేలా చేస్తుండ‌డంతో అస‌లైన అంశాలు ప‌క్క‌దారి ప‌డుతున్నాయి. అప్ర‌స్తుత ప్ర‌సంగాలు, అన్య ప‌దాల‌తో, జ‌నం ఈస‌డించుకునేలా ఆరోప‌ణ‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. అసెంబ్లీ స‌మావేశాలు వాడి వేడి జ‌రిగేలా త‌మ‌ను తాము ఫోక‌స్ చేసుకునేలా ఉప‌యోగించు కుంటున్నార‌న్న విమ‌ర్శ‌లు లేక పోలేదు. గ‌తంలో ర‌జ‌బ్ అలీ, జైపాల్ రెడ్డి, వెంక‌య్య నాయుడు , స‌మ‌ర సింహా రెడ్డి లాంటి సీనియ‌ర్లు ప్ర‌శ్న‌ల‌తో ఆడుకునే వారు. ఒకానొక స‌మ‌యంలో స‌మాధానం చెప్ప‌లేక తిక‌మ‌క ప‌డిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి.

ఇక ఎలాంటి హంగు ఆర్భాటాలు, అధికార ద‌ర్పం లేకుండా అసెంబ్లీకి వ‌చ్చిన వాళ్లు లేక పోలేదు. వారిలో మాజీ ఎమ్మెల్యే గుమ్మ‌డి న‌ర్స‌య్య లాంటి వారు ఆదర్శ ప్రాయంగా నిలిచారు. ప్ర‌స్తుతం కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ , గ‌తంలో ఏలిన గులాబీ బాస్ ల మ‌ధ్య చోటు చేసుకున్న సంభాష‌ణ‌లు స‌భ్య స‌మాజానికి ఉప‌యోగ ప‌డేలా లేవు. ఏది ఏమైనా అసెంబ్లీ అన్న‌ది ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కు వేదిక కావాలే త‌ప్పా అరుపులు, కేక‌లు, దూష‌ణ‌లు, ఆరోప‌ణ‌ల‌కు కేరాఫ్ కూకూడ‌ద‌న్న‌ది తెలుసుకుంటే మంచిది.

Also Read : Vijayashanti : బీఆర్ఎస్ పై రాములమ్మ గుస్సా

Leave A Reply

Your Email Id will not be published!