President Droupadi Murmu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
President Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహా ద్వారం వద్ద అర్చకులు ఆమెకు సాంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు వేదాశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున రాష్ట్రపతికి చిత్రపటాన్ని అందించారు.
President Droupadi Murmu – భక్తులకు చాక్లెట్లు పంచిన ముర్ము
తిరుమలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) అనూహ్య చర్యకు దిగారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం తిరుగు పయనంలో ఆమె రాంభకిచా వద్ద తన కాన్వాయ్‌ను ఆపారు. వాహనం దిగిన ఆమె కరచలనం చేస్తూ స్వయంగా భక్తులకు చాక్లెట్లు పంచారు. ఈ క్రమంలో.. ఆమె కాన్వాయ్ దిగడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే.. రెండ్రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురవారమే తిరుమల చేరుకున్నారు. శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో బస చేసిన ఆమె.. అంతకు ముందు తిరుచానూరు వెళ్లి శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమల పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు బయలుదేరారు.
పద్మావతి అమ్మవారి సేవలో రాష్ట్రపతి
శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) గురువారం తిరుమల చేరుకున్నారు. అంతకుముందు ఆమె తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. కుమార్తె ఇతిశ్రీ ముర్ము, ఇతర కుటుంబసభ్యులతో కలిసి సాయంత్రం 4.20 గంటలకు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన రాష్ట్రపతి, కుటుంబ సభ్యులు అక్కడి నుంచి నేరుగా తిరుచానూరు ఆలయానికి వెళ్లారు. వారికి వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం మహద్వారం నుంచి లోపలికి ప్రవేశించిన ద్రౌపదీ ముర్ము ముందుగా ధ్వజస్తంభానికి మొక్కారు. అనంతరం అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఆశీర్వాద మండపంలో రాష్ట్రపతికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌లు అమ్మవారి ప్రసాదాలు, జ్ఞాపికలు అందించి శేషవస్త్రంతో సత్కరించారు.
తిరుచానూరులో అమ్మవారి ఆలయం ఎదుట రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కలెక్టర్ వెంకటేశ్వర్, తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే పులివర్తి నాని, బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఫొటో దిగారు. ఆలయం వెలుపల మీతో ఫొటో దిగుతామంటూ తితిదే బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి విజ్ఞప్తి చేయగా రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి రామనారాయణరెడ్డితోపాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని… రాష్ట్రపతితో కలిసి ఫొటో దిగారు. సమీపంలోనే ఉన్న ఈవో సింఘాల్, కలెక్టర్ వెంకటేశ్వర్‌లను రాష్ట్రపతి పిలవడంతో వారూ వచ్చి ఫొటో తీయించుకున్నారు.
అన్యమత చిహ్నాలతో తిరుమలకు వాహనం
అన్యమత చిహ్నాలతో ఉన్న వాహనాన్ని గుర్తించి అడ్డుకోవడంలో నిర్లక్ష్యం వహించారంటూ అలిపిరి టోల్ సిబ్బంది ఒకరిని విధుల నుంచి టీటీడీ(TTD) తొలగించింది. టీఎన్ 31 ఏఈ 4073 నెంబరు గల టెంపో ట్రావెలర్ గురువారం అలిపిరి దాటి నిరాటంకంగా తిరుమలకు చేరుకుంది. ఫైర్ స్టేషన్‌కు వెనుక పార్కింగ్‌లో ఉన్న తమిళనాడుకు చెందిన ఈ వాహనంలో అన్యమత చిహ్నం, స్టిక్కర్‌తో ఉండడాన్ని కొందరు గుర్తించి విజిలెన్స్, మీడియాకు సమాచారమిచ్చారు. విజిలెన్స్ సిబ్బంది అక్కడకు చేరుకుని అన్యమత చిహ్నాలను తొలగించారు. కాగా అలిపిరి(Alipiri) తనిఖీ కేంద్రంలోని తొమ్మిదోలైన్ నుంచి వాహనం వచ్చిందని గుర్తించి, అక్కడ విధుల్లో ఉన్న వాసు అనే భద్రతా ఉద్యోగిని తొలగించి, శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని టీటీడీ తెలిపింది. వాహన డ్రైవర్ గోబి, యజమానిపై కేసు నమోదు చేశారు.
Also Read : SSC Exam Schedule: ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
