14న దుర్గమ్మను దర్శించుకోనున్న రాష్ట్రపతి ముర్ము
షెడ్యూల్ కు సంబంధించి వస్తున్న వార్తలు అబద్దం
విజయవాడ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడ కనకదుర్గమ్మ అమ్మ వారిని దర్శించుకునేందుకు రానున్నారు ఈనెల 14న. అయితే ఆమె పర్యటనకు సంబంధించిన సమయంపై ప్రసారమవుతున్న వార్తలలో వాస్తవాలు లేవని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ కమిటీ. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దర్శన పర్యటన షెడ్యూల్ , ఆలయ మహా నివేదన సమయాలపై కొన్ని మాధ్యమాలలో వస్తున్న వార్తలపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం స్పందించింది.
రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి రాష్ట్రపతి భవన్ సెక్రటేరియట్, రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ , పోలీస్ , జిల్లా యంత్రాంగంతో ప్రాథమిక సమన్వయం జరుగుతోందని, వారి పర్యటన అధికారిక, తుది మినిట్-టు-మినిట్ షెడ్యూల్ ఉన్నత స్థాయిలో నిర్ణయించ బడుతుందని తెలిపింది. దేవస్థానంలో ప్రతీరోజూ సాయంత్రం 06:00 గంటల నుండి 07:00 గంటల వరకు శ్రీ అమ్మ వారికి మహానివేదన , పంచ హారతులు జరగడం ఆనవాయితీగా వస్తోందని తెలిపింది. కాగా 6 నుండి 6.30కు అమ్మవారి నివేదన పూర్తి అయి, అనంతరం పంచ హారతులు సేవలో కొన్ని దర్శనం క్యూలైన్లు నడుపుతామని పేర్కొంది. మహానివేదన, పంచ హారతుల క్రతువు సాయంత్రం 07:00 గంటలకే పూర్తవుతుందని స్పష్టం చేసింది.
సాయంత్రం 07:15 నుండి 07:30 గంటల మధ్య రాష్ట్రపతి దర్శనం జరిగినా అది నివేదన అనంతరం జరిగేదే తప్ప, నివేదన సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శనాలు నిర్వహించబడదని, దేవస్థానం ఆగమ విధానాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించింది దేవస్థానం. దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి పర్యటనను అత్యంత భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యులతో దేవస్థాన అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించింది. వైదిక కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. వైదిక పండితుల మార్గ దర్శకత్వంలో, శాస్త్రోక్త విధి విధానాలకు ఏమాత్రం భంగం కలగకుండానే రాష్ట్రపతికి వేదాశీర్వచనం, దివ్య దర్శనం కల్పించేలా ఏర్పాట్లు రూపొందిస్తున్నామని తెలిపింది.
