తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. జూన్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జరుగనుంది. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడు రోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘’అభిద్యేయక అభిషేకం’’ అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవ మూర్తులు అరిగి పోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.
మొదటిరోజు శ్రీ మయప్పస్వామి వారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండవరోజు ముత్యాల కవచం సమర్పిస్తారు. మూడవ రోజు తిరుమంజ నాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం సమయంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఇదిలా ఉండగా టీటీడీ భక్తులకు కీలక సూచనలు చేసింది. జ్యేష్టాభిషేకాన్ని పురస్కరించుకుని జూన్ 28వ తేదిన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను రద్దు చేసినట్లు తెలిపింది.ఇదిలా ఉండగా పెద్ద ఎత్తున భక్తులు రానుండడంతో విస్తృతంగా సాలకట్ల జ్యేష్టాభిషేకం కోసం ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది టీటీడీ.