ఏఐ డీప్ ఫేక్ కంటెంట్ ల దుర్వినియోగంపై సమంత కోర్టుకు
పోస్ట్ చేసినా లేదా షేర్ చేసినా చర్యలు తప్పవు
ముంబై : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) జనరేటెడ్, ఇతర డిజిటల్ కంటెంట్‌లో నటి సమంత రూత్ ప్రభు పేరు, ఫోటోలు, గొంతును అనధికారికంగా ఉపయోగించడంపై బాంబే హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోరుతూ సమంత దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఈ ఉత్తర్వులు వచ్చాయి. ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు, ఈ-కామర్స్ వెబ్‌సైట్లు , డిజిటల్ మీడియా సంస్థలలో తన గుర్తింపు, వ్యక్తిగత లక్షణాలను అనుమతి లేకుండా వాడుతున్నారని ఆరోపిస్తూ పిటిషన్ లో పేర్కొంది. తన పేరు, చిత్రం , గొంతును అనధికారికంగా ఉపయోగించడంపై అలాగే దాని వల్ల తన ప్రతిష్ట , వాణిజ్య ప్రయోజనాలపై పడే ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు.
నటికి సంబంధించిన అనధికారిక కంటెంట్‌ను తొలగించాలని కోర్టు ఆదేశించడంతో పాటు ఆమె పేరు, ఫోటోలు, గొంతును అనధికారికంగా ఉపయోగించకుండా మధ్యంతర రక్షణ కల్పించింది. భారతీయ న్యాయస్థానాలలో ఏఐ-సృష్టించిన డీప్‌ఫేక్‌లు, మార్ఫింగ్ చేసిన ఫోటోలు , ప్రముఖుల ఇతర డిజిటల్ రూపాలకు సంబంధించిన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. నటి శృతి హాసన్‌కు సంబంధించిన ఇటీవలి బాంబే హైకోర్టు విచారణలు కూడా ఏఐ-మార్ఫింగ్ , డీప్‌ఫేక్ కంటెంట్, వ్యక్తిత్వ హక్కులకు సంబంధించిన ఆరోపణలను పరిశీలించాయి.
సమంత తన వ్యాపారం , గుడ్‌విల్ ముంబైలో ఉన్నప్పటికీ తన వృత్తిపరమైన, వాణిజ్య కార్యకలాపాలు న్యాయస్థానం స్థానిక ప్రాదేశిక అధికార పరిధిని దాటి విస్తరించి ఉన్నాయని సమర్పించినట్లు సమాచారం. తన వ్యక్తిత్వంలోని అంశాలను అనధికారికంగా దుర్వినియోగం చేయకుండా ఆమె చట్టపరమైన రక్షణ కోరారు.
