తిరుమల : గత సెప్టెంబరులో తిరుమలలో జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అధికారుల సమన్వయంతో విజయవంతం అయ్యాయని, ఇదే స్ఫూర్తితో నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని టిటిడి అదనపు ఈఓ వెంకయ్య చౌదరి కోరారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో విధులు కేటాయించిన టిటిడి ఉద్యోగులకు తిరుమల ఆస్థాన మండపంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను చక్కటి సమన్వయంతో నిర్వహించామని, ఈ విజయం ఉద్యోగుల అందరిదని చెప్పారు.జెఈవో డాక్టర్ శరత్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది కలిసి టీమ్ వర్క్ గా పని చేయడం వల్ల గత బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయని అన్నారు.
ఇదే స్ఫూర్తితో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సివిఎస్ఓ మురళీకృష్ణ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల భద్రత చాలా కీలకమైన అంశమని పేర్కొన్నారు. కావున మాడవీధుల్లో కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ భద్రతాధికారుల సూచనలను తప్పక పాటించాలని కోరారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ వెళ్లేందుకు వీలుగా గేట్లను తెరిచి ఉంచడానికి ఉద్యోగులు, శ్రీవారి సేవకులు సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో జెఈవో(విద్య, వైద్యం) గోపీనాథ్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ).
ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ లో దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. దీంతో తిరుమల పుణ్య క్షేత్రానికి భారీగా తమ కుటుంబీకులతో భక్త బాంధవులు తరలి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది టీటీడీ.
