‘స‌ర్’ ప్ర‌క్రియ సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాలి

స్ప‌ష్టం చేసిన రాష్ట్ర ఎన్నిక‌ల అధికారి సుద‌ర్శ‌న్ రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కొన‌సాగుతున్న స‌ర్ ప్ర‌క్రియ‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి సుద‌ర్శ‌న్ రెడ్డి. ప‌లు సూచ‌న‌లు కూడా చేశారు. ఇవాళ ఆయ‌న అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి , డిప్యూటీ సీఈవో జి.ఎస్. చారిలతో కలిసి ప్రస్తుతం జరుగుతున్న ‘ప్రత్యేక సమగ్ర సవరణ (స‌ర్ )-2026స‌పై హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్, హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారితో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నిక‌ల అధికారులు, ఎన్నిక‌ల న‌మోదు అధికారులు, స‌హాయ ఎన్నిక‌ల న‌మోదు అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

‘అసమానతలు’ ‘మ్యాపింగ్ లేనివి’ వంటి అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు సీఈవో. బీఎల్ ఓలు, ఈఆర్ఓలు, డీఈఓలు సాధించిన పురోగ‌తిని ఆయ‌న అభినందించారు. బీఎల్ ఓ సూపర్‌వైజర్లు, బీఎల్ ఓలు, ఏఈఆర్ఓలు రోజువారీ లక్ష్యాలకు కట్టుబడి ఉండాలని అన్నారు. అంతే కాకుండా కేటాయించిన పనిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు సీఈఓ సుద‌ర్శ‌న్ రెడ్డి. ఫారమ్ 6, 7, 8లకు సంబంధించిన పెండింగ్ అంశాలు , విచారణ/హీరింగ్ కేసులను తక్షణమే పరిష్కరించాల‌ని స్ప‌ష్టం చేశారు. అదే సమయంలో ఓటర్లకు తమకు సంబంధించిన పత్రాలను సమర్పించడానికి తగిన సమయం ఇవ్వాల‌ని పేర్కొన్నారు.

బీఎల్ఓ సూపర్‌వైజర్లు , బీఎల్ఓల కు ఆమోదయోగ్యమైన పత్రాల జాబితాపై అవగాహన ఉండాల‌న్నారు సీఈవో. తద్వారా అవసరమైన సమాచారాన్ని ఓటర్లకు సరిగ్గా వివరించేందుకు వీలు క‌లుగు తుంద‌న్నారు. నోటీసుల జారీ ప్రక్రియలో బీఎల్ఏల‌ను భాగస్వామ్యం చేయకూడదన్నారు. ఇళ్లను గుర్తించడంలో బీఎల్ఓల‌కు సహాయ పడటం వరకే వారి పాత్ర పరిమితం చేయాల‌న్నారు . ఇక ఈఆర్ఓ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న కేసులను ఆలస్యం లేకుండా పరిష్కరించాలన్నారు. పెండింగ్‌ను క్లియర్ చేయడానికి అవసరమైన చోట అదనపు సిబ్బందిని (ఉదాహరణకు కంప్యూటర్ ఆపరేటర్లను) నియమించు కోవ‌చ్చ‌ని తెలిపారు. కంప్యూటర్ ఆపరేటర్ల పనిని సంబంధిత ఈఏఈఆర్ఓ లు, ఈఆర్ఓలు, బీఎల్ఓ సూప‌ర్ వైజ‌ర్లు ప‌ర్య‌వేక్షించాల‌ని ఆదేశించారు సీఈఓ.

ప్రజల సమాచారం కోసం ఫారమ్ 6, 7, 8లు , సంబంధిత వివరాలను నోటీసు బోర్డుపై క్రమం తప్పకుండా ప్రదర్శించాలని అన్నారు. పారదర్శకత కోసం రాజకీయ పార్టీలతో పంచుకోవాలని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల తరపున, ఆయా సందర్భాల్లో, కుటుంబంలోని ఏ సభ్యుడైనా అవసరమైన పత్రాలను సమర్పించ వ‌చ్చ‌ని తెలిపారు. దివ్యాంగులు , వృద్ధులు విచారణ జరిగే ప్రదేశాలకు స్వయంగా హాజరు కావాలని అనవసరంగా ఒత్తిడి చేయకూడదన్నారు సీఈఓ. అలాగే ఎన్నారైల‌ విషయంలో, వీలైనంత వరకు అధీకృత ప్రతినిధి ద్వారా కూడా పత్రాలను సమర్పించేందుకు ఛాన్స్ ఉంద‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!