సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు
ప్రాజెక్టులు పూర్తి చేయడం తోనే ‘వాటర్‌మ్యాన్’గా సీఎంకు గుర్తింపు
అమరావతి : రాష్ట్రంలోని ప్రాజెక్టులపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు, పార్టీకి లేదని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విమర్శించారు. వైసీపీ పాలనలో ప్రాజెక్టులకు బ్రేకులు పడితే.. కూటమి ప్రభుత్వ హయాంలో అవే ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయని అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని విమర్శించారు. ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు తగదని హితవు పలికారు. ఇరు ప్రభుత్వాల హయాంలో జరుగుతున్న ప్రాజెక్టుల పురోగతిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వైసీపీ హయాంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు విరిగినా అప్పటి జగన్ రెడ్డి ప్రభుత్వం స్పందించ లేదని మంత్రి గొట్టిపాటి ఆరోపించారు. గేటు ఏర్పాటు చేయకుండా ఇసుక దోపిడీకి నాటి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చిందని విమర్శించారు. ప్రజల నీటి అవసరాల కంటే వైసీపీ ప్రభుత్వానికి ధన దాహమే ముఖ్యమైందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని మంత్రి గొట్టిపాటి అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చే సమయానికి దాదాపు 70 శాతం పనులు పూర్తయినప్పటికీ.. ఐదేళ్లలో ఒక్క శాతం పనిని కూడా ముందుకు తీసుకెళ్లలేదని విమర్శించారు. పనులు నిలిచిపోయినా అప్పటి ప్రభుత్వంలో చలనం లేకపోవడం రాష్ట్ర ప్రజలు ఇంకా మరిచి పోలేదన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు విషయంలోనూ వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కొనసాగిందని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. టన్నెల్‌లో యంత్రం ఇరుక్కు పోయినా దాన్ని బయటకు తీసేందుకు అవసరమైన చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వాసితులకు రూ.1,000 కోట్లు అందించిందని స్పష్టం చేశారు. ఫీడర్ కెనాల్‌ను పూర్తి చేయడం, టన్నెల్‌లో ఇరుక్కున్న యంత్రాన్ని బయటకు తీయడం, గుండ్లకమ్మ ప్రాజెక్టుకు కొత్త గేటు ఏర్పాటు చేయడం కూటమి ప్రభుత్వ హయాంలోనే జరిగాయని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. నాడు చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు దిల్లీకి వెళ్లి వెలిగొండ ప్రాజెక్టుకు గెజిట్ నోటిఫికేషన్ సాధించారని పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా వాసులకు కలగా మిగిలి పోతుందనుకున్న వెలిగొండ ప్రాజెక్టుకు 10 టీఎంసీల నీటిని అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని మంత్రి గొట్టిపాటి చెప్పారు. చంద్రబాబును దేశ వ్యాప్తంగా ‘వాటర్‌మ్యాన్’గా పిలవడానికి ఆయన చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులే నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసి నీటిని అందిస్తుంటే గతంలో పనులు చేయని వైసీపీ నేతలు ఇప్పుడు వాటి ఘనతను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి విమర్శించారు. ఇది క్రెడిట్ చోరీ కాక మరేమిటని వైసీపీ నేతలను మంత్రి గొట్టిపాటి ప్రశ్నించారు. ‘ఒక్క అవకాశం’ అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టిందని గొట్టిపాటి ఆరోపించారు. తాము చేయని పనులకు కూడా క్రెడిట్ కోరడం వైసీపీకి అలవాటై పోయిందని మండిపడ్డారు. అయితే రాష్ట్ర ప్రజలు గత ఐదేళ్ల పాలనను, ప్రాజెక్టుల పరిస్థితిని మరిచి పోలేదని స్పష్టం చేశారు.
