Vijayakanth Comment : ప్ర‌జా నాయ‌కుడా అల్విదా

విజ‌య‌కాంత్ కు అశ్రు నివాళి

Vijayakanth Comment : ఇక సెల‌వంటూ వెళ్లి పోయిన కెప్టెన్ విజ‌యకాంత్ కు అశేషమైన సంఖ్య‌లో జ‌నం అశ్రు నివాళి అర్పించింది. న‌టుడిగా, రాజ‌కీయ వేత్త‌గా ఆయ‌న సాగించిన ప్ర‌స్థానంలో ఎన్నో అవ‌మానాలు ఉన్నాయి. మ‌రెన్నో తీపి గుర్తులు ఉన్నాయి. త‌న‌ది ఆక‌ట్టుకునే రూపం కాదు. కానీ తాను ఎదుర్కొన్న ఇబ్బందులు ఇంకొక‌రికి రాకుండా ఉండేందుకు ప్ర‌య‌త్నం చేసిన తీరు ఎంద‌రో న‌టీ న‌టుల‌కు, రాజ‌కీయ నాయ‌కుల‌కు స్పూర్తిగా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు. అన్నార్థుల‌కు, అనాధ‌ల‌కు, దిక్కులేని వారికి అండ‌గా నిలిచిన తీరు ప్ర‌శంస‌నీయం..స‌ర్వ‌దా అభినంద‌నీయం కూడా. విజ‌య‌కాంత్(Vijayakanth) అంతిమ యాత్రకు వ‌చ్చిన ప్ర‌జ‌ల‌తో, అభిమానుల‌తో ఏకంగా 10 కిలోమీట‌ర్ల మేర సాగింది. జ‌య‌ల‌లిత త‌ర్వాత చెన్న ప‌ట్ట‌ణంలో పూర్తిగా కెప్టెన్ అమ‌ర్ ర‌హే అంటూ నినాదాల‌తో హోరెత్తి పోయింది.

Vijayakanth Comment Viral

చెన్నై లోని ఐలాండ్ గ్రౌండ్స్ నుండి డీఎండీకే ప్ర‌ధాన కార్యాల‌యానికి దారి పొడ‌వునా నిల్చుని విజ‌య‌కాంత్ భౌతిక కాయంపై పూలు చ‌ల్లారు. త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. ఒక ర‌కంగా ఆయ‌న మ‌న‌సున్నోడు. ఎవ‌రికి క‌ష్టం వ‌చ్చినా విల విల లాడి పోయే మ‌న‌స్త‌త్వ‌మే అత‌డికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల‌ను తెచ్చేలా చేసింది. విజ‌య‌కాంత్(Vijayakanth) కు 71 ఏళ్లు. త‌మిళ నాట రాజ‌కీయాల‌లో ఎంజీఆర్ (రామ‌చంద్ర‌న్) త‌ర్వాత ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ఎలుగెత్తిన ఏకైక నాయ‌కుడు ఆయ‌నే . మ‌నుషులంటే అభిమానం, అంత‌కు మించిన దాతృత్వం త‌న‌ను ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిగా నిల‌బెట్టేలా చేసింది విజ‌య‌కాంత్ ను. త‌మిళ సినీ రంగంలో ఆఫీస్ బాయ్ నుంచి న‌టీన‌టులు, నిర్మాత‌, ద‌ర్శ‌కుల‌కు ఒకే ర‌క‌మైన భోజ‌నం అందించేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. అత్యంత బ‌ల‌మైన నాయ‌కురాలిగా ఉన్న జ‌య‌ల‌లిత‌తో విభేదించాడు. డీఎండీకే పార్టీని స్థాపించి తాను నిజ‌మైన కెప్టెన్ న‌ని నిరూపించాడు .

విజ‌య‌కాంత్ అస‌లు పేరు నారాయ‌ణ‌న్ విజ‌య‌రాజ్ అల‌గ‌ర్భ్సామి. 25 ఆగ‌స్టు 1952లో మదురైలో పుట్టాడు. ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల‌లో న‌టించాడు. 2001లో అత్యున్న‌త పౌర పుర‌స్కారం క‌లైమామ‌ణి అందుకున్నాడు. శాస‌న స‌భ‌లో 16వ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్నాడు. విజ‌య‌కాంత్(Vijayakanth) న‌టుడే కాదు ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, పొలిటిక‌ల్ లీడ‌ర్, ప‌రోప‌కారి. పిలిస్తే ప‌లికే కెప్టెన్. పేద‌ల‌ను ఆదుకున్నందుకు గాను విజ‌య‌కాంత్ కు న‌ల్ల‌జాతి ఎంజీఆర్ అని కూడా అక్క‌డి వారు పిలుచుకుంటారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయ‌న సినిమాలు ఎక్కువ‌గా తెలుగు, హిందీలోకి అనువాదం అయ్యాయి. త‌న కెరీర్ లో కేవ‌లం త‌మిళ చిత్రాల‌లో మాత్ర‌మే న‌టించారు.

అవినీతి, నిజాయితీ, ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టు కోవ‌డంపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు విజ‌య‌కాంత్. 1979లో ఇనిక్కుం ఇల‌మై చిత్రంతో త‌న కెరీర్ ప్రారంభ‌మైంది. 2015 వ‌ర‌కు న‌టించాడు. 154 సినిమాల‌లో న‌టించిన విజ‌య‌కాంత్ త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో అత్యంత ఆరాధించే సినీ న‌టుల్లో ఒక‌డిగా గుర్తింపు పొందాడు. రాజ‌కీయంగా ప‌క్క‌న పెడితే విద్యా రంగంపై ఆస‌క్తిని క‌న‌బ‌ర్చారు . 2001లో ఆండాల్ అళ‌గ‌ర్ ఇంజ‌నీరింగ్ కాలేజీ స్థాపించాడు. 2010లో కెప్టెన్ టీవీని స్టార్ట్ చేశాడు. 2012లో కెప్టెన్ న్యూస్ 24 న్యూస్ ఛాన‌ల్ కు శ్రీ‌కారం చుట్టాడు. హాస్య న‌టుడు వ‌డివేలుతో వివాదం , ర‌జ‌నీకాంత్ పై చేసిన విమ‌ర్శ‌లు విజ‌య‌కాంత్ ను కొంత ఇబ్బందికి గురి చేసింది. ఏది ఏమైనా ప్ర‌జా నాయ‌కుడిగా త‌మిళ నాట చిర‌స్థాయిగా నిలిచి పోయారు.

Also Read : CM YS Jagan Comment : జ‌గ‌న్ పోరాటం ద‌క్కేనా విజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!