Wings India 2024: బేగంపేటలో ‘వింగ్స్‌ ఇండియా-2024’ ఏవియేషన్‌ షో ప్రారంభం !

బేగంపేటలో ‘వింగ్స్‌ ఇండియా-2024’ ఏవియేషన్‌ షో ప్రారంభం !

Wings India 2024: హైదరాబాద్ లోని బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ వేదికగా ‘వింగ్స్‌ ఇండియా–2024’ ఏవియేషన్ షో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఏవియేషన్‌ షో ను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ… ‘‘గత రెండేళ్లలో విమాన ప్రయాణికుల సంఖ్య 260 మిలియన్‌లు పెరిగిందని… అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. 2047 నాటికి విమానయాన రంగం 20 ట్రిలియన్ డాలర్ల వృద్ధిని సాధించే దిశగా ముందుకు వెళ్తున్నాం.

డ్రోన్‌లకు డిమాండ్ పెరగడంతో… మహిళా పైలట్లను తీర్చిదిద్దుతున్నాం. ఇవాళ పలు విమానయాన సంస్థల మధ్య ఒప్పందాలు జరిగాయి. పౌర విమానయాన చరిత్రలో ఇది నిలిచిపోయే రోజు. అమెరికా, చైనా తర్వాత భారత్(India) అత్యధిక ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేస్తోంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎంతో ముందుకు దూసుకుపోతున్నాం. సాధారణ పౌరుడికి సైతం విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలని మోదీ సంకల్పించారు. ఆ దిశగా ముందుకెళ్తున్నాం.. ఆకాశమే మన హద్దు’’ అని సింధియా చెప్పారు.

Wings India 2024 – హైదరాబాద్‌ ఎంతో అనుకూలం- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

‘‘హైదరాబాద్‌లో ‘వింగ్స్‌ ఇండియా–2024’ ఏవియేషన్‌ షో నిర్వహించడం సంతోషంగా ఉంది. తెలంగాణలో(Telangana) ఏవియేషన్‌ రంగానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సులభతర వాణిజ్య విధానం ఇక్కడ అమలవుతోంది. ఏరో స్పేస్‌ పెట్టుబడులకు హైదరాబాద్‌ ఎంతో అనుకూలం. డ్రోన్‌ పైలట్లకు ఎక్కువగా శిక్షణ ఇచ్చి… వ్యవసాయం, అత్యవసర పరిస్థితులు, శాంతిభద్రతల్లో డ్రోన్లు వినియోగిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

106 దేశాలకు చెందిన 25 రకాల విమానాల ప్రదర్శన !

గురువారం నుండి ఈ నెల 21 వరకు మొత్తం నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ ఏవియేషన్‌ షోలో 106 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు, ఐదువేల మంది బిజినెస్‌ విజిటర్స్‌ పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 130 ఎగ్జిబిటర్స్‌, 15 చాలెట్స్‌లతో మొత్తం 25 రకాల విమానాలను ప్రదర్శనకు ఉంచారు. ‘వింగ్స్‌ ఇండియా–2024(Wings India 2024)’ ఏవియేషన్ షోలో ఎయిర్‌ ఇండియా ఏ350 (ఇండియాలో ఈ తరహా విమానం మొదటిది), బోయింగ్‌ 777 ఎక్స్‌ (దేశంలోనే తొలిసారిగా ప్రదర్శన) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రముఖ హెలికాప్టర్‌ తయారీ సంస్థలు అగస్తా వెస్ట్‌ల్యాండ్‌, బెల్‌ హెలికాప్టర్స్‌, రష్యన్‌ హెలికాప్టర్స్‌, ఎయిర్‌బస్‌ హెలికాప్టర్స్‌,… ప్రముఖ ఇంజిన్‌ తయారీ సంస్థలు సీఎఫ్‌ఎం, యూటీసీ, జీఈ ఏవీయేషన్‌, రోల్స్‌ రాయిస్‌, ప్రట్‌ అండ్‌ వైట్నీ లతో పాటు యూఎస్‌ఏ, కెనడా, ఫ్రాన్స్‌, జమైకా, మారిషస్‌, బెల్జియం, జర్మనీ, న్యూజిలాండ్‌, సౌత్‌కొరియా, గ్రీక్‌, మలేసియా, యూఏఈ వంటి దాదాపు 25 దేశాల ప్రతినిధులు ఏవియేషన్‌ ఎగ్జిబిషన్‌ కు హాజరయ్యారు.

శని,ఆది వారాల్లో మాత్రమే సందర్శకులకు అనుమతి

మొత్తం నాలుగు రోజుల పాటు జరగబోయే ఈ ఏవియేషన్ షోలో పాల్గొనడానికి మొదటి రెండు రోజులు వ్యాపార, వాణిజ్య వేత్తలకు అవకాశం ఇవ్వగా… ఆ తరువాత రెండు రోజులు సామాన్యులకు అవకాశం కల్పించారు. అయితే సాధారణ సందర్శకులు రూ.750 టిక్కెట్టు తీసుకుని ఏవియేషన్ షోకు వెళ్లాల్సి ఉంటుంది. ‘బుక్‌మైషో’ యాప్‌ లో నిర్వాహకులు టికెట్లను అందుబాటులో ఉంచారు. అయితే 30 అడుగుల దూరంలో బారికేడ్ల నుంచి మాత్రమే ఎగ్జిబిషన్ లో ఉంచిన విమానాలను సందర్శకులు చూసే అవకాశం ఉంటుంది. ప్రపంచంలోనే ఏరోబాటిక్స్‌ చేసే ఏకై క జట్టుగా పేరొందిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్‌ టీం… ఈనెల 18 నుంచి 21 వరకు విన్యాసాలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సారంగ్ టీం విన్యాసాలు ప్రత్యక్షంగా తిలకించడానికి పెద్ద ఎత్తున సందర్శకులు ఏవియేషన్ షో కు విచ్చేస్తున్నారు.

Also Read : PM Narendra Modi: ‘రామమందిరం’ పోస్టల్‌ స్టాంప్‌లు విడుదల చేసిన ప్రధాని మోదీ !

Leave A Reply

Your Email Id will not be published!