Ayodhya Ram Mandir : 2024 నాటికి రామాలయం రెడీ
యుద్ద ప్రాతిపదికన పనులు
Ayodhya Ram Mandir : శ్రీరాముడు జన్మించినట్లుగా భావిస్తున్న అయోధ్య లోని రామాలయం(Ayodhya Ram Mandir) పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కోట్లాది రూపాయల ఖర్చుతో దీనిని నిర్మిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రధాన మంత్రిగా కొలువు తీరిన నరేంద్ర మోదీ హయాంలో పూర్తి అయ్యేలా ప్లాన్ చేశారు.
వచ్చే 2024లో పూర్తి స్థాయిలో రామ భక్తులకు దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ గర్భగుడిలో ముందుగా దేవతా మూర్తులను ప్రతిష్టిస్తారు. ఆ తర్వాత సంప్రోక్షణ అనంతరం భక్తులను గుడి ద్వారంలోకి దర్శనం కోసం అనుమతి ఇస్తారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు రామ మందిర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్.
ఇందులో భాగంగా వచ్చే సంక్రాంతి రోజు గర్భ గుడిల రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. ఇప్పటి వరకు 50 శాతానికి పైగా పనులు రామాలయంలో పూర్తయ్యాయి. వెయ్యి ఏళ్లకు సరిపడా ఉండేలా అత్యంత అధునాతన టెక్నాలజీతో దీనిని నిర్మిస్తున్నారు. రామాలయంలో 392 స్తంభాలు, 12 తలుపులు ఇప్పటికే అమర్చారు.
విచిత్రం ఏమిటంటే ఎలాంటి ఇనుప కడ్డీలు వాడకుండా వీటిని నిర్మిస్తుండడం విశేషం. రాళ్లను కలిపేందుకు ఇనుముకు బదులు రాగి చిప్ లను ఉపయోగిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ వెల్లడించింది. ఇదిలా ఉండగా అయోధ్యలో కొలువు తీరే రామాలయం నిర్మాణ ఖర్చు రూ. 1800 కోట్లు కావడం గమనార్హం. 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది.
ఇక గర్భ గుడిలో 160 స్తంభాలు నిర్మించారు. టేకు చెక్కతో 12 ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు. రాజస్తాన్ నుంచి ప్రత్యేకంగా ఆలయం కోసం గ్రానైట్ రాళ్లను తీసుకు వచ్చారు.
Also Read : కాంగ్రెస్ ప్రస్థానం సోనియా సంతకం
