AmitShah : ర‌ద్దే ముద్దు… ఆ ఒక్క‌టి అడ‌గొద్దు

Amit Shah : మంగళవారం రైతు సంఘాల భారత్ బంద్ పై అధికార బిజెపి ఎంత నోరు పారేసుకున్నా.. ప్రజల‌ మద్దతు పొంది, విజయవంతమైందన్న‌ది వాస్త‌వం.

Amit Shah : మంగళవారం రైతు సంఘాల భారత్ బంద్ పై అధికార బిజెపి ఎంత నోరు పారేసుకున్నా.. ప్రజల‌ మద్దతు పొంది, విజయవంతమైందన్న‌ది వాస్త‌వం. అమెరికా, బ్రిటన్‌తో సహా ప‌లు దేశాలలో బంద్‌కు అనూహ్య మ‌ద్ద‌తు ల‌భించ‌డంతో పాటు వారి డిమాండ్లన్నీ స‌హేతుక‌మైన‌వేన‌ని, చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని సూచ‌న‌లు అంద‌తుండ‌టం, సామాజిక మాద్య‌మాల‌లో భారత ప్రభుత్వ ప్రతిష్ట దారుణంగా దెబ్బతినేలా క‌థ‌నాలు రావ‌టం, . రైతులతో కేంద్రం ఇప్పటి వరకు ఐదు విడతలుగా చర్చలు జరిపినా ఫ‌లితం లేక పోవ‌టంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగినా ఫ‌లితం శూన్యం.

పూసా ప్రాంతంలోని వ్యవసాయ పరిశోధన సంస్థ వద్ద అమిత్ షాకు, 14 రైతు సంఘాల నేతలకు మధ్య చర్చ మొదలైనా, రైతులు ర‌ద్దు అంశంపై మొండిపట్టు పట్టడంతో , పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించిన వ్యవసాయ బిల్లులను రద్దు చేయడం అసాధ్యమని అమిత్ షా తేల్చి చెప్ప‌డంతో షా చేసిన ప్రయత్నం విఫలమైందనే చెప్పాలి.

రద్దు మినహా రైతులు కోరుకునే ఎలాంటి సవరణలకైనా సిద్ధంగా ఉన్నామని షా తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తారా లేదా అనే ప్రశ్నకు సమాధానం మాత్రమే కోరుతున్నామని సవరణలకు తాము అంగీకరించమని రైతులు తేల్చి చెప్పడంతో పీట‌ముడి మ‌రింత బిగిసిన‌ట్టు క‌నిపిస్తోంది.

ఈ నేపథ్యంలో రైతులకు వ్యవసాయ చట్టాలపై ఉన్న 40 అభ్యంతరాలను పరిశీలించామని, ప్రభుత్వం ఈ చట్టాలకు ఏ సవరణలు చేయాలనుకుంటున్నదీ పంపిస్తామని వాటిని పరిశీలించి తర్వాత నిర్ణయానికి రండి అని షా కోరడంతో రైతునేతలు అంగీకరించినా, చ‌ట్టాల ర‌ద్దు వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ క్ర‌మంలోనే బుధవారం కేంద్రమంత్రుల సారధ్యంలోని ప్రభుత్వ బృందంతో రైతులు జరపాల్సిన చర్చలు రద్దయ్యాయి. కేంద్రప్రతిపాదనలపై మ‌రోమారు జరిపే చర్చల్లో రైతు సంఘాలు తుది విషయం ఖరారు చేసే అవ‌కాశాలు మొండుగా క‌నిపిస్తున్నాయ‌ని అధికార వ‌ర్గాలు చెబుతున్న మాట.

మ‌రోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో కొద్దిరోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న రైతుల్లో 50 శాతం మంది అనారోగ్యం బారిన పడ్డారు. కొంతమంది దగ్గుతో బాధపడుతుండగా, మరికొందరు తలనొప్పి, జలుబుతో బాధపడుతున్నారు. అక్కడే శిబిరాలను ఏర్పాటు చేసిన వైద్యులు… రైతులకు వైద్య సేవలు అందిస్తున్నారు . రైతుల నిరసనతో మమేకమయ్యేందుకు ప్రతిపక్షాల్లో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌ పవార్‌, సిపిఎం నేత సీతారాం ఏచూరి చర్చలు జరిపారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు అయిదుగురు సభ్యుల ప్రతినిధి వర్గం రాష్ట్రపతి కోవింద్‌ను కలుసుకుని వ్య‌వ‌సాయ చ‌ట్టాలపై రైతుల‌లో రేగిన అల‌జ‌డి, ప్ర‌భుత్వ నిర్వాకాల‌పై విజ్ఞాప‌న ఇచ్చారు

 

No comment allowed please