అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగింపు సందర్భంగా పోలీస్ అధికారులకు కొన్నికీలక సూచనలు చేశారు. వీఐపీలు, వీవీఐపీల పర్యటనల సందర్భంగా ఎక్కువ హడావుడి చేయవద్దంటూ దిశా నిర్దేశం చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సింపుల్ గా ఉంటేనే ప్రజలు మెచ్చుకుంటారని, ఆ విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగి తప్పు చేసినా ఆ ప్రభావం ప్రభుత్వంపై పడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచు కోవాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి నేతలు వస్తే వారి సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు సీఎం. శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటూనే ప్రజా హితంగా పోలీసులు మెలగాలని దిశా నిర్దేశం చేశారు. సమాజంలో ఉండే సమస్యలకు అనుగుణంగా పోలీసు విభాగం స్పందించాలన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారని 15 నిముషాల ముందే ట్రాఫిక్ నిలుపుదల చేయవద్దని ఆదేశించారు.
తమ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని మరోసారి విజ్ఞప్తి చేశారు సీఎం. తన కాన్వాయ్ ను కూడా గణనీయంగా తగ్గించానని చెప్పారు..కాన్వాయ్ తగ్గిన తర్వాత ప్రశాంతంగా ఉందన్నారు. పోలీసు కానిస్టేబుల్ తప్పు చేసినా సీఎంను, ప్రభుత్వాన్నే దూషిస్తారన్నారు. ప్రజాప్రతినిధుల్ని గౌరవిస్తూనే న్యాయ సమ్మతంగా వ్యవహరించాలని అన్నారు. పొలిటికల్ గవర్నెన్సు విధానంలోనే కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని చెప్పారు. కూటమి పార్టీల నేతలందరూ సమానమేనని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై కూటమికి పార్టీలకు చెందిన నేతలెవ్వరు వచ్చినా గౌరవించాలని, ఆ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ప్రజల్ని భాగస్వాములను చేస్తే చేపట్టే కార్యక్రమాలు విజయవంతం అవుతాయని అన్నారు. భోగాపురం విమానాశ్రయం, వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్టుల ప్రారంభించినప్పుడు ప్రజల స్పందన అనూహ్యంగా వచ్చిందన్నారు.
