న్యూఢిల్లీ : రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ ఏపీలో కొత్త ఈఎస్ఐ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. కార్మికులకు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలను మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయకు ఆయన వినతిపత్రం పంపారు. ఈఎస్ఐ పథకం దేశంలోని కార్మికులు, వారి కుటుంబాలకు కీలకమైన సామాజిక భద్రతా వ్యవస్థగా ఉందని, ఉద్యోగుల ఆరోగ్య రక్షణలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉందని ఎంపీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి, పట్టణీకరణ, ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కార్మికులు, వారి కుటుంబాల అవసరాలకు అనుగుణంగా ఈఎస్ఐ వైద్య మౌలిక వసతులను కూడా విస్తరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈఎస్ఐ ఆస్పత్రులు, వైద్య సదుపాయాలు తగిన స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో పలువురు బీమా పొందిన కార్మికులు వైద్యం కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన చెందారు. తగిన వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో కార్మికులు తప్పనిసరిగా ప్రైవేట్ ఆస్పత్రులపై ఆధారపడాల్సి వస్తోందని, దీనివల్ల కార్మిక కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఎంపీ పేర్కొన్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తర ఆంధ్ర ప్రాంతాల్లో ఈఎస్ఐ ఆస్పత్రుల నెట్‌వర్క్‌ను విస్తరించాలని ఎంపీ కోరారు. ముఖ్యంగా కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, ఏలూరు వంటి ప్రధాన కేంద్రాలతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కర్నూలులో 30 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు ఇప్పటికే ఆమోదం లభించిందని, భవిష్యత్తులో దీనిని 100 పడకలకు విస్తరించే అవకాశం ఉన్నందున ఈ ప్రాజెక్టును వేగవంతం చేసి కార్మికులకు త్వరితగతిన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని కోరారు.
అదే విధంగా విశాఖపట్నంలోని షీలానగర్‌లో ప్రతిపాదిత 400 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని ఈఎస్ఐ ఆస్పత్రి పరిధిలో పెరుగుతున్న వైద్య అవసరాలకు అనుగుణంగా మరింత బలోపేతం చేసి ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో ప్రతిపాదిత 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రుల ప్రాజెక్టులను కూడా సమీక్షించి, స్పష్టమైన కాలపరిమితితో పూర్తి చేయాలని కోరారు. గుంటూరు-మంగళగిరి-అమరావతి ప్రాంతంలో పెరుగుతున్న ఆర్థిక, ఉపాధి కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని గుంటూరులో ప్రత్యేక ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని లింగమనేని రమేశ్ కోరారు. అదే విధంగా పశ్చిమ గోదావరి ప్రాంతానికి ముఖ్యమైన కేంద్రంగా ఉన్న ఏలూరులో కూడా ప్రత్యేక ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు ప్రాంతాల్లో ఈఎస్ఐ ఆస్పత్రుల ఏర్పాటు వల్ల కార్మికులు, వారి కుటుంబాలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు, నాణ్యమైన వైద్య సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం-అనకాపల్లి-అచ్యుతాపురం పారిశ్రామిక కారిడార్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీ సూచించారు. ఈ ప్రాంతంలోని ప్రధాన పారిశ్రామిక క్లస్టర్లకు సమీపంలో అదనపు ఈఎస్ఐ డిస్పెన్సరీలు, డయాగ్నస్టిక్ కేంద్రాలు, శాటిలైట్ వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరారు. కార్మికులు పనిచేసే ప్రాంతాలకు దగ్గరగా వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడటం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో కూడా వారికి వేగంగా చికిత్స అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుత ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో ఉన్న మౌలిక వసతులు, సిబ్బంది కొరతలను కూడా తక్షణమే పరిష్కరించాలని లింగమనేని రమేశ్ కోరారు. పలుచోట్ల వైద్యులు, స్పెషలిస్టులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పడకలు, అవసరమైన మందులు, డయాగ్నస్టిక్ సదుపాయాలు తగినంతగా లేవని, వీటిపై సమగ్రంగా సమీక్షించి, ఖాళీలను ప్రాధాన్యతా ప్రాతిపదికన భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల ఎంపానెల్‌మెంట్ ప్రత్యేక వైద్య సేవలకు అనుబంధంగా ఉపయోగపడవచ్చని, అయితే బలమైన ప్రభుత్వ ఈఎస్ఐ ఆస్పత్రుల నెట్‌వర్క్‌కు అది ప్రత్యామ్నాయం కాదని ఎంపీ స్పష్టం చేశారు.
