PM Narendra Modi: ఉగ్రదాడులపై పాకిస్తాన్ కు భారత్ సీరియస్ వార్నింగ్

ఉగ్రదాడులపై పాకిస్తాన్ కు భారత్ సీరియస్ వార్నింగ్

PM Narendra Modi : పాకిస్తాన్‌ కు భారత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇకపై ఏ ఉగ్రదాడినైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని హెచ్చరించింది. పాకిస్తాన్ రెచ్చిపోతే అంతకు అంత ప్రతిదాడితో విరుచుకుపడాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) అధ్యక్షతన త్రివిధ దళాధిపతులతో జరిపిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై ఏ ఉగ్రదాడినైనా యుద్ధ చర్యగా పరిగణించాలని, అంతే తీవ్ర స్థాయిలో బదులివ్వాలని ప్రధాని దిశానిర్దేశం చేశారని తెలిసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ ఈ కీలక సమావేశంలో పాల్గొన్నారు.

PM Narendra Modi Strong Warning

భారత్‌ లో 26 లొకేషన్ల పై పాక్ డ్రోన్ దాడులకు ప్రతిగా శనివారం తెల్లవారు జామున నాలుగు పాక్ ఎయిర్‌బేస్‌లపై భారత్ దాడులు చేసింది. అనంతరం నేపథ్యంలో మోదీ ఈ సమావేశం నిర్వహించారు. దేశ భద్రతా విషయంలో మరింత కఠిన వైఖరి ప్రదర్శించాలని ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత ప్రయోజనాలను దెబ్బతీసేలా భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడినా దానిని యుద్ధ చర్యగా పరిగణించాలని సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇకపై ఉగ్రవాద చర్యలను కేవలం అంతర్గతా భద్రతా చర్యలుగానే పరిగణించలేమని, ప్రతిస్పందన అత్యంత భీకరంగా ఉంటుందనే ప్రత్యక్ష హెచ్చరిక సందేశాన్ని భారత్ ఇచ్చినట్లయింది.

పంజాబ్‌ – జమ్మూలో పాక్‌ క్షిపణి శకలాలు లభ్యం

భారత్‌(India) పై పాకిస్థాన్‌(Pakistan) క్షిపణులతో దాడులకు ఉపక్రమించింది. పంజాబ్‌ లోని అమృత్‌సర్‌ లో క్షిపణి శకలాలు లభ్యమయ్యాయి. పాక్‌ సంధించిన క్షిపణిని భారత క్షిపణి రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసింది. పంజాబ్‌ లోని ఫిరోజ్‌పుర్‌ గృహసముదాయాలపై పాక్‌ డ్రోన్లతో దాడులు చేసింది. ఓ కుటుంబానికి చెందిన సభ్యులు గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. జమ్మూలోని శంభూ ఆలయం సమీపంలోనూ పాక్‌ క్షిపణి శకలాలు దొరికాయి.

పాకిస్థాన్‌ నుంచి మరిన్ని దాడులు ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పంజాబ్‌లోని చండీగఢ్‌లో మళ్లీ సైరన్‌ మోగించి హెచ్చరికలు జారీ చేశారు. దాడులు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాల్కనీలకు దూరంగా ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరించారు. పంజాబ్‌ లోని బఠిండాలో అధికారులు రెడ్‌ అలర్ట్‌ విధించారు. ఉత్తర, పశ్చిమ భారత్‌లో విమానాశ్రయాలను కేంద్రం మూసివేసింది. మొత్తం 32 విమానాశ్రయాలను ఈ నెల 15 వరకు మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. శ్రీనగర్‌ విమానాశ్రయంపై డ్రోన్లతో పాక్‌ దాడికి యత్నించడంతో కేంద్రం అప్రమత్తమైంది.

పాక్ గగనతలం మూసివేత

మరోవైపు పాకిస్థాన్‌ తమ గగనతలం మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. పౌర విమానాలే రక్షణ కవచంగా పాక్‌ దాడులకు ఉపక్రమించిందని భారత్‌ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనితో గగనతలాన్ని మూసివేసినట్లు పాక్‌ ప్రకటించింది.

Also Read : Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ లో హతమైన టాప్‌ టెర్రరిస్ట్‌ ల వివరాలు వెల్లడి

Leave A Reply

Your Email Id will not be published!