PM Dhan Dhaanya Krishi Yojana: ‘ధనధాన్య కృషి’ అమలుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం !

‘ధనధాన్య కృషి’ అమలుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం !

PM Dhan Dhaanya Krishi Yojana : దేశంలో వెనుకబడిన 100 జిల్లాల్లో వ్యవసాయానికి చేయూతనందించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన’ (PM Dhan Dhaanya Krishi Yojana)ను అమలుచేయాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. కేంద్రంలోని 11 మంత్రిత్వ శాఖల్లో అమల్లో ఉన్న 36 పథకాలను సమ్మిళితం చేసి ఈ పథకాన్ని అమలుచేయనున్నారు. వాటికింద ఏటా ఖర్చుచేసే రూ.24,000 కోట్లనే ఈ పథకానికి కేటాయిస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి ఆరేళ్లపాటు ఇది అమల్లో ఉంటుంది. ప్రతి రాష్ట్రం నుంచి కనీసం ఒక జిల్లాను ఈ పథకానికి ఎంపిక చేస్తారు. ఉత్పాదకత, సాగు విస్తీర్ణం, రుణ వినియోగం… ఈ మూడూ తక్కువగా ఉన్న జిల్లాలను ఎంపికచేసి మిగతా జిల్లాలతో సమానంగా పైకి తీసుకురావడానికి చేయూతనందిస్తారు. దీనికింద 1.7 కోట్లమంది రైతులకు ప్రయోజనం లభిస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ విలేకరులకు వెల్లడించారు.

PM Dhan Dhaanya Krishi Yojana – పథకం ప్రధానోద్దేశం ఏమిటంటే ?

ఈ 100 జిల్లాల్లో పంట ఉత్పాదకత పెంచడం, పంటల మార్పిడి, సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం… పంచాయతీ, మండల స్థాయిల్లోనే పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచడమేనని చెప్పారు. ఉత్పాదకతను పెంచడానికి సాగునీటి సదుపాయాలు, స్వల్ప-దీర్ఘకాల రుణ వితరణను విస్తృతం చేయనున్నట్లు వివరించారు.ధనధాన్య కృషి యోజనను (PM Dhan Dhaanya Krishi Yojana) సమర్థంగా అమలు చేయడానికి అవసరమైన ప్రణాళికల రూపకల్పనకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో కమిటీలు ఏర్పాటుచేస్తారు. జిల్లా ధనధాన్య సమితి.. జిల్లాస్థాయి వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల ప్రణాళికను ఖరారు చేస్తుంది. ఇందులో వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, అభ్యుదయ రైతులు సభ్యులుగా ఉంటారు. పంటల వైవిధ్యం పాటించడంతోపాటు నీరు, భూసార సంరక్షణ, వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో స్వయంసమృద్ధి సాధించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రతి జిల్లాలో ఈ పథకం పురోగతిని 117 ముఖ్యమైన సూచికల ఆధారంగా లెక్కిస్తారు. డ్యాష్‌బోర్డు ఏర్పాటుచేసి నెలవారీగా విశ్లేషిస్తారు. నీతి ఆయోగ్‌ కూడా ఎప్పటికప్పుడు సమీక్షించి జిల్లాలకు మార్గనిర్దేశం చేస్తుంది. పథకం అమలుకోసం ప్రతి జిల్లాకు కేంద్ర నోడల్‌ అధికారి ఉంటారు.

పునరుత్పాదక ఇంధనోత్పత్తి రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వరంగ ఎన్‌టీపీసీకి క్యాబినెట్‌ అనుమతిచ్చింది. రూ.20వేల కోట్ల నిధులు సమీకరించుకునేందుకు పచ్చజెండా ఊపింది. 2032నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఎన్‌టీపీసీ, దాని అనుబంధ సంస్థ ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌లు దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి వీలవుతుంది. నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ రూ.7వేల కోట్లను ఎన్‌ఎల్‌సీ ఇండియా రెన్యూవబుల్స్‌ లిమిటెడ్‌లో పెట్టుబడి పెట్టడానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా రోదసిలో 18 రోజులు గడిపి విజయవంతంగా భూమికి తిరిగివచ్చిన వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. భారత అంతరిక్ష కార్యక్రమంలో ఇది నూతన అధ్యాయాన్ని లిఖించిందని, దేశానికిది గర్వకారణమని శ్లాఘించింది.

Also Read : CM Revanth Reddy: దిల్లీలో సమావేశమైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!