PM Narendra Modi: ఈ నెల 25న మాల్దీవులకు ప్రధాని మోదీ
ఈ నెల 25న మాల్దీవులకు ప్రధాని మోదీ
Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారంలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. జులై 23 నుంచి 26 వరకు యూకే (UK), మాల్దీవుల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. గతేడాది మోదీపై, లక్షద్వీప్ పై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. విభేదాల అనంతరం ప్రధాని ఆ దేశానికి వెళ్లడం ఇదే మొదటిసారి కావడంతో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మాల్దీవులతో బలమైన దౌత్య సంబంధాలు, పరస్పర ప్రయోజనాలు పునరుద్ధరించడానికి ఈ పర్యటన సహకరిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తంచేశారు.
PM Narendra Modi Today Visit
జులై 23-24 తేదీలలో మొదట యూకేలో జరగనున్న భారత్-బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై జరిగే చర్చల్లో మోదీ పాల్గొని..ఒప్పందంపై సంతకం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. యూకే ప్రభుత్వంతో దౌత్య, వాణిజ్య చర్చలు జరపనున్నారు. అనంతరం జులై 25-26 తేదీలలో ప్రధాని మాల్దీవులకు వెళ్లనున్నారు. మాల్దీవుల 60వ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరవుతారు.
గతేడాది జనవరిలో లక్షద్వీప్‌ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)… సాహసాలు చేయాలనుకున్నవారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. ఇది ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను దెబ్బతీసే స్థాయికి చేరింది. అనేకమంది భారతీయులు… ఆ దేశ టూర్ ప్లాన్‌ను విరమించుకున్నారు. సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బాయ్‌కాట్ మాల్దీవ్స్ పేరిట హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది. ఆ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టిన మాల్దీవులు.. ఆ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. అనంతరం ఆ మంత్రులపైనా వేటు వేసింది. ఆ తర్వాత నుంచి అధ్యక్షుడు ముయిజ్జు తీసుకున్న భారత వ్యతిరేక నిర్ణయాలు కూడా ఇరుదేశాల మధ్య దూరాన్ని పెంచాయి.
Also Read : AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సిట్
