Priyanka Chaturvedi: బీసీసీఐపై శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆగ్రహాం
బీసీసీఐపై శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆగ్రహాం
Priyanka Chaturvedi : జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌తో పలు ద్వైపాక్షిక, ఇతర సంబంధాలను భారత్ తెంచుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీకి బీసీసీఐ (BCCI) అనుమతించడాన్ని శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది (Priyanka Chaturvedi) తప్పుబట్టారు. బర్మింగ్‌హామ్ వేదికగా భారత ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య ఈనెల 20న మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నీకి బీసీసీఐ అనుమతించడంపై చతుర్వేది మండిపడ్డారు. ఇది సిగ్గుచేటని విమర్శించారు. ఇండియా-పాకిస్థాన్ ఉద్రిక్తల నడుమ జాతీయ భావోద్వేగాలను పట్టించుకోకపోవడాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆమె నిలదీశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌తో ఎలాంటి సంబంధాలు ఉండవని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ఆమె భారత క్రికెట్ బోర్డుకు గుర్తు చేశారు. పహల్గాంలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకోక ముందే పాక్‌తో మ్యాచ్‌లు ఆడటం సరికాదని వ్యాఖ్యానించారు.
Priyanka Chaturvedi Slams BCCI
”ఈ చర్య సిగ్గుచేటు. పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలు లేవని భారత ప్రభుత్వం చెప్పిన మాట ఏమైంది? పహల్గాం ఉగ్రవాదులను పట్టుకోక ముందే పాక్‌తో మ్యాచ్‌లకు అనుమతించాల్సిన అవసరం ఏమొచ్చింది ? పహల్గాం ఉగ్రదాడిలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయి ఉంటే బీసీసీఐ, ఐసీసీలు తమ డబ్బు గురించి ఆలోచించడం నైతిక దివాళాకోరుతనాన్నే సూచిస్తుంది’ అని చతుర్వేది ఘాటుగా విమర్శించారు. చతుర్వేది విమర్శలపై బీసీసీఐ కానీ, మ్యాచ్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారులు కానీ వెంటనే స్పందించలేదు.
పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలు లేవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, బీసీసీఐ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటే మోదీ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రియాంక చతుర్వేది (Priyanka Chaturvedi) ప్రశ్నించారు. తమ వారిని కోల్పోయిన కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయి ఉంటే బీసీసీఐ, ఐసీసీలు తమ డబ్బు గురించి ఆలోచించడం వారి నైతికతను ప్రశ్నిస్తోందన్నారు. మ్యాచ్‌లో పాల్గొనే ఆటగాళ్లకు సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిగా పాక్‌పై భారత్ పలు ఆంక్షలు విధించింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
కాగా.. వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజండ్స్ టోర్నీలో భాగంగా ఆదివారం భారత్ ఛాంపియన్స్- పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య బర్మింగ్‌హామ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. యువరాజ్ సింగ్ నాయకత్వంలో భారత్ తలపడనుంది. శిఖర్ ధావన్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, గుర్కీరత్ సింగ్, యూసఫ్ పఠాన్, స్టువర్ట్ బిన్నీ, ఇర్ఫాన్ పఠాన్, రాబిన్ ఉతప్ప, హర్భజన్ సింగ్, పీయూశ్ చావ్లా, వినయ్ కుమార్, వరుణ్ ఆరోన్, అభిమన్యు మిథున్, సిద్ధార్థ్ కౌల్ భారత స్క్వాడ్ లో ఉన్నారు. ఆసియా కప్ (Asia Cup 2025)లోనూ భారత్ పాల్గొనడంపై క్రికెట్ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. మరోవైపు క్రికెట్ సహా ఇతర క్రీడల్లో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకూడదని ఇప్పటికే భారత్ నిర్ణయం తీసుకుంది. క్రికెట్లోనూ ఇరు జట్ల మధ్య సిరీస్‌లు జరగడం లేదు. ఇరు దేశాల జట్లు ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి.
Also Read : DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే కాన్వాయ్‌కు ప్రమాదం ! ఐదుగురికి గాయాలు !
