CJI Justice BR Gavai: జస్టిస్‌ వర్మ కేసు విచారణ నుంచి వైదొలిగిన సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌

జస్టిస్‌ వర్మ కేసు విచారణ నుంచి వైదొలిగిన సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌

CJI Justice BR Gavai : ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. తన వాదన వినకుండానే చర్యలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ… జస్టిస్‌ వర్మ తాజాగా సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌ విచారణ నుంచి వైదొలుగుతున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ (CJI Justice BR Gavai) వెల్లడించారు. విచారణ కమిటీలో తాను ఉన్నందున దాన్ని వేరొక బెంచ్‌కు బదిలీ చేస్తామని పేర్కొన్నారు.

CJI Justice BR Gavai Left..

ఈ విషయం పలు రాజ్యాంగ సమస్యలను లేవనెత్తుతుండడం వల్ల తమ పిటిషన్‌ను వీలైనంత త్వరగా విచారించాలని జస్టిస్ వర్మ (Justice Varma) తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై స్పందిస్తూ.. విచారణ కమిటీలో తాను కూడా సభ్యుడిగా ఉన్నందున ఈ కేసును విచారించబోనని సీజేఐ స్పష్టం చేశారు. ఇదే కేసులో ఇటీవల న్యాయవాది మాథ్యూస్‌ నెడుంపర జస్టిస్‌ వర్మను ఏకవచనంతో సంబోధించడంపై జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై అత్యవసరంగా విచారణ జరపాలని మూడు పిటిషన్లు దాఖలు చేయడం పైనా ఆయన అసహనం వ్యక్తంచేశారు. ఈ కేసు నుంచి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ వైదొలగడంతో ఈ కేసు విచారణకు ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటుచేయడానికి సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటోంది.

దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంటి ఆవరణలో కాలిపోయిన నోట్ల కట్టలు దొరికాయి. ఈ ఘటనపై అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా.. అంతర్గత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ నోట్ల కట్టలు దొరికింది వాస్తవమేనని తేల్చింది. దీంతో రాజీనామా చేయాల్సిందిగా జస్టిస్‌ వర్మకు సీజేఐ సూచించారు. ఆయన తిరస్కరించడంతో.. అభిశంసనకు సిఫారసు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీలకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా లేఖలు రాశారు. జస్టిస్‌ వర్మను విధుల నుంచి తొలగించాలని కోరుతూ పార్లమెంటు ఉభయసభల్లో ఎంపీలు అభిశంసన తీర్మానాన్ని ఇచ్చారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఈమేరకు 145 మంది ఎంపీలు తమ పిటిషన్‌ను సమర్పించారు. అదేవిధంగా రాజ్యసభలోనూ 63 మంది ప్రతిపక్ష ఎంపీలు నోటీసులు సమర్పించారు.

Also Read : Tejashwi Yadav: ఓటర్ల జాబితా సవరణపై తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!